ఏపీ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు..దశాబ్దాల కాలం నుంచి అనంతపురం రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక ఏళ్ళు కాంగ్రెస్ లో పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి వచ్చేశారు. జేసీ బ్రదర్స్ 2014 ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటారు. అనంతపురం ఎంపీగా దివాకర్, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్ గెలిచారు.
2019 ఎన్నికలోచ్చేసరికి ఇద్దరు నేతలు తప్పుకుని, వారి వారసులని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అనంతపురం ఎంపీగా దివాకర్ తనయుడు పవన్, తాడిపత్రి అసెంబ్లీలో ప్రభాకర్ తనయుడు అస్మిత్ పోటీ చేశారు. కానీ ఎప్పుడూలేని విధంగా జేసీ ఫ్యామిలీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఇద్దరు వారసులు ఓటమి పాలయ్యారు. కంచుకోట లాంటి తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఓడిపోవడం అదే తొలిసారి.
అలా ఓటమి పాలైన ఇద్దరు వారసులు..మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనంత పార్లమెంట్ లో మళ్ళీ గెలవాలని పవన్ పనిచేస్తున్నారు…కాకపోతే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పనిచేస్తున్నట్లు లేరు. అలాగే టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. అటు తాడిపత్రిలో అస్మిత్ రెడ్డి బదులు…ప్రభాకర్ దూకుడుగా పనిచేస్తున్నారు. అస్మిత్ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రభాకర్ తాడిపత్రిపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు.
అలాగే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ గెలవడానికి కృషి చేశారు. కేవలం జేసీ ఫ్యామిలీ వల్లే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ గెలిచింది. ఇక ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ కూడా అయ్యారు. అయితే తాడిపత్రిలో మొత్తం వ్యవహారాలు ప్రభాకర్ రెడ్డి చూసుకుంటున్నారు. దీని బట్టి చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఆయనే పోటీ చేస్తారా? లేక తన వారసుడుకు అవకాశం ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. అనంత పార్లమెంట్ లో మాత్రం పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అటు అనంతలో, ఇటు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి గెలుపు అవకాశాలు మెండుగానే ఉన్నాయి.