రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం కష్టం. అయితే, వాటికి అనుగుణంగా వ్యూహాలు వేసుకుని ముందుకు సాగడం అనేది రాజకీయ నేతలకు అత్యంత అవసరం. వారు సీనియర్లు అయినా.. జూనియర్లు అయినా.. కూడా రాజకీయాల్లో వ్యూహాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అయితే, దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారట.. విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించాక.. నియోజకవర్గం రాజకీయాలు ఊపందుకున్నాయి.
అవినాష్ దూకుడు పెంచారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్పటికే రెండు పార్టీల్లో చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆ అనుభవంతో ప్రజలకు చేరువ అవుతున్నారు. జగన్ మంచి ప్రయార్టీ ఇవ్వడంతో తూర్పు రాజకీయాల్లో దూసుకు పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పులో ఎట్టి పరిస్థితిలోనూ పాగా వేయాలని నిర్ణయింకున్న అవినాష్ దానికి అనుగుణంగా దూసుకుపోతున్నారు. ఇక, ఇక్కడ నుంచి వరుసగా విజయం సాధించిన సీనియర్ నాయకుడు.. గద్దె రామ్మోహన్ మాత్రం ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కరోనా నేపథ్యం కావొచ్చు.. లేదు పార్టీలో తన హవా తగ్గిందని భావించొచ్చు.. ఆయన అసలు ప్రజలను పట్టించుకోవడం లేదు.
అదే సమయంలో యువ నేత దేవినేని అవినాష్ మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో అవినాష్ దూకుడును నేరుగా ఎదుర్కొనలేక గద్దె ఇప్పుడు చిల్లర రాజకీయాలకు తెరదీశారని పార్టీలోను నియోజకవర్గంలోనూ చర్చ సాగుతోంది. గత సెప్టెంబర్ నెలలో విజయవాడ తూర్పు 2, డివిజన్ మాచవరం కొండ ప్రాంతంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న మెట్ల మార్గాన్ని పరిశీలించి తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు అవినాష్. దీంతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యే గద్దె.. అదే అభివృద్ధి పనులపై కొన్నాళ్లకు టీడీపీ కార్యకర్తలతో గుట్టు చప్పుడు కాకుండా ప్రారంభోత్సవాలు చేయించారు.
దీంతో నియోజకవర్గంలోని ప్రజలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి.. అయిపోయిన పనులకు శంకుస్థాపన ఎందుకు? అని వారే ఎమ్మెల్యేను నిలదీసే పరిస్థితి వచ్చిందట. ఇప్పుడు ఈ విషయంపై బెజవాడ వాసుల్లో సోషల్ మీడియాలో గద్దెకు వ్యతిరేకంగా ట్రోలింగ్ కూడా నడుస్తోంది. కేవలం ఓటమి భయంతోపాటు అవినాష్ దూకుడును ఎదుర్కొనే సత్తాలేకపోవడం వల్లే ఇలా దొంగచాటు కార్యక్రమాలకు చిల్లర రాజకీయాలకు తెరదీస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తానెంతో సీనియర్‌నని తరచుగా చెప్పుకొనే గద్దెకు ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకని సొంత పార్టీ టీడీపీలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారో ? చూడాలి.