దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని భారత దేశం గుర్తించింది. ఆయన చేసిన త్యాగానికి గానూ మరణానంతరం మహావీర్ చక్రతో సత్కరించనుంది. నేడు ఆయనకు మహావీర్ చక్రను ప్రదానం చేయనుంది. గల్వాన్ లోయలో చైనా ఆర్మీతో వీరోచితంగా పోరాడి కల్నల్ సంతోష్ బాబు మరణించిన సంగతి తెలిసింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని స్మరించుకుని నగదు పరిహారంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు భారత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చారు.
గతేడాది చైనా దొంగ దెబ్బలో సంతోష్ బాబు మరణించాడు. లఢక్ రీజియన్ లో గాల్వాన్ ఘటనలో ఆయన వీరమరణం పొందారు. ఆపరేషన్ స్నో లెపార్డ్‌లో లడఖ్ సెక్టార్‌లోని గాల్వాన్ లోయలో శత్రువుల ఎదురుగా అబ్జర్వేషన్ పోస్ట్‌ను ఏర్పాటు చేస్తున్న సమయంలో చైనా ఆర్మీ దాడి చేసింది. చైనా ఆర్మీ దాడిని విజయవంతంగా తిప్పికొట్టడంతో సంతోష్ బాబు ప్రముఖ పాత్ర వహించారు. ఆ ఘటనలోనే మరణించారు. చైనా ఆర్మీ దాడిని ప్రతిఘటించినందుకు కల్నల్ సంతోష్ బాబు ఈరోజు మరణానంతరం మహావీర చక్రను అందుకోనున్నారు. అయితే ఈ దాడిలో చైనా సైనికులు కూడా ఎక్కువ మంది చనిపోయినా.. ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు.