భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీ నాయకత్వంలో కమలదళం బరిలోకి దిగనుందనే టాక్ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్ కోల్‌కతాలో ఓ పాఠశాల నెలకొల్పాలనుకుంది. అందుకు ఈశాన్య కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండెకరాలు కేటాయించింది. అయితే ఆ స్థలం న్యాయవివాదంలో చిక్కుకోవడంతో గంగూలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇటీవల సీఎం మమతా బెనర్జీని కలుసుకున్న గంగూలీ ఆ రెండెకరాల స్థలాన్ని వాపస్ ఇస్తున్నట్టు ఆమెకు చెప్పాడట.
*స్థలం వివాదంలో ఉండడంతో సౌరవ్ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ సొసైటీ దానిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేస్తున్నట్టు లేఖ రాసింది. ఆ లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది* అని పశ్చిమ బెంగాల్ గృహ మౌలిక సదుపాయల కల్పన అభివృద్ధి సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గంగూలీ బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఏకంగా రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన కమలంవర్గాల్లో వినిపిస్తోంది.