విశాఖ మన్యం
తెలంగాణ సరిహద్దు
ఆంధ్రా ఒడిశా ప్రాంతం
పేరు ఏదయినా అసాంఘిక శక్తుల
నడవడి ఇక్కడ ఊహించని స్థితిలో పెరిగిపోతోంది.
ముఖ్యంగా యువతను టార్గెట్ గా చేసుకుని గంజాయి ముఠాలు శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోతున్నాయి. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా మైనర్లు కొందరు తమకు తెలియకుండానే ఈ రొంపిలోకి దిగుతున్నారు. ముందు రవాణా మార్గం ఎంచుకున్నాక తరువాత అన్నింటినీ వదిలి వీటికి బానిసలు అవుతున్న వారెందరో! పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు అన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే గంజాయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాల రవాణా అన్నది సులువుగా సాగిపోతోంది. వీరి వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉండడం కూడా ఒకందుకు కలిసొచ్చే విషయమే!
సమస్య ఎక్కడయినా పరిష్కారం మాత్రం అందరిదీ. కానీ ఇప్పుడు సమస్య ఒక చోట ఉన్నా కూడా పరిష్కారం అందరికీ సాధ్యం కాని పని అవుతోంది. ముఖ్యంగా హైద్రాబాద్ ను డ్రగ్ ముఠాలు శాసిస్తుంటే, కోదాడ లాంటి సరిహద్దు ప్రాంతాదఆంధ్రా – తెలంగాణ పోలీసుల కన్నుగప్పి గంజాయి అమ్ముడవుతోంది. కొన్ని సార్లు గంజాయి రవాణాను అడ్డుకుంటున్నా కూడా తెలంగాణ పోలీసుల కన్నుగప్పి కొంతమంది తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాకు పొరుగున ఉన్న ఒడిశా నుంచి నాటు సారా ప్రవాహాలు విపరీతం గా వస్తున్నా కూడా ఆపే వీల్లేదు అన్న విధంగా ఇప్పుడున్న వాతావరణం తయారైంది. ఆంధ్రాలో నాటు సారా లభ్యం కాని రోజుల్లో ఒడిశా నుంచి తెప్పించుకుని వ్యాపారాలు సాగేందుకు వీలుగా సంబంధిత వర్గాలు తమదైన రహస్య మార్గాలు ఎంచుకుంటున్నాయి.ఇవే వారికి లాభాలు ఆర్జించి పెడుతున్నాయి.
ఈ దశలో ఆంధ్రాలో గంజాయి..ఒడిశాలో నాటు సారా..తెలంగాణలో డ్రగ్స్ ఈ విధంగా మూడు రాష్ట్రాలనూ వరుస ఘటనలు కదిపి కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో నిఘా కొరవడడంతో తరుచూ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. చాలా చోట్ల నిఘా కొరవడడం, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పై సంబంధిత ముఠాలు దాడులు చేయడం తదితర కారణాల రీత్యా గంజాయి కానీ సారాయి కానీ యథేచ్ఛగా ఊరు దాటి పోతోంది. ఇదే సమయంలో తెలంగాణను గుడుంబాతో పాటు హుక్కా సెంటర్లు కూడా శాసిస్తున్నాయి. వీటి మత్తు చాలదన్న విధంగా డ్రగ్స్ రాకెట్ యమ స్పీడుగా చక్కర్లు కొడుతోంది.