గంటా…నీ రాజకీయానికో దండం… !

-

ఏపీలో ఓ పట్టాన అర్ధంకాని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే…అది గంటా శ్రీనివాసరావు అని ఠక్కున చెప్పేయొచ్చు. ఈయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో, ఏ నియోజకవర్గంలో ఉంటారో కూడా ఎవరికి అర్ధంకాదు. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితం చూస్తే అలాగే ఉంటుంది. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన గంటా 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, మంత్రిగా పనిచేశారు.

మళ్ళీ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి, భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో అదే టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ నుంచే గంటా రాజకీయం మారిపోయింది. టీడీపీ అధికారంలో లేకపోవడంతో, గంటా పార్టీ మారిపోవడానికి చూస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన పార్టీ మాత్రం మారలేదు గానీ, మారుతున్నట్లు హింట్ బాగానే ఇస్తున్నారు.

అదే సమయంలో అప్పుడప్పుడు టీడీపీతోనూ టచ్‌లో ఉంటున్నారు. కాకపోతే ఇటీవల గంటా వైసీపీలో చేరడం ఖాయమైపోయిందని వార్తలు వచ్చేశాయి. ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని, గంటా టీడీపీని వీడటమే తరువాయి అని ప్రచారం జరిగింది.  ఇటు టీడీపీ కూడా గంటాని వదిలేసింది. ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్లు పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పటికీ గంటా రాజకీయం ఎవరికి అర్ధం కావట్లేదు. వైసీపీలో చేరబోతున్నా, టీడీపీ నేతలతో మాత్రం టచ్‌లో ఉంటున్నారు.

ఇటీవల వరుసగా ఆయనని విశాఖ, అనకాపల్లి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు కలిశారు. అలాగే గంటా కూడా కొత్త అధ్యక్షులకు శుభాకాంక్షలు చెప్పారు. దీని బట్టి చూస్తే గంటా ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదు. అసలు గంటా టీడీపీలో ఉంటారో, వైసీపీ వైపుకు వెళ్తారో అర్ధం కావడం లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో గంటా ఎలాంటి సంచలనం సృష్టిస్తారో..?

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version