వచ్చే నెలలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో ‘కోడ్’ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే వాహనాల తనిఖిల్లో భాగంగా ఓ కారులో భారీగా నగదు పట్టుబడింది. ఖేడ్ శివ్‌పూర్ టోల్ ప్లాజా వద్ద కారులో రూ.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం రాజ్‌గడ్ పీఎస్‌కు తరలించారు.విచారణలో భాగంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన వారిలో శివసేన ఎమ్మెల్యే షాహాజీబాపు పాటిల్ సహచరుడు షాహాజీ నలవాడే కూడా ఉన్నారు. అయితే, ఆ కారు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు చెందినదని శివసేన యూటీబీ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. వాహనంలో పట్టుబడిన నగదు రూ.5 కోట్లు కాదని.. రూ.15 కోట్లు అని ఆరోపించారు. పోలీసులు కావాలని తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు.త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.75 కోట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపించారు.