గ్రేటర్ కార్పోరేటర్లలో మళ్లీ మొదలైన పదవుల పోటీ

-

రాజకీయాల్లో ఎన్నికల్లో పోటి చేసి గెలవడం ఒక ఎత్తైతే.. గెలిచాక పెద్ద పదవుల్లో చేరటం మరో ఎత్తు. గ్రేటర్‌ హైదరాబాద్ లో కార్పోరేటర్లుగా గెలిచిన వాళ్ళు మేయర్ అవ్వాలనుకుంటారు.. లేదంటే డిప్యూటీ మేయర్ కావడానికి ప్రయత్నిస్తారు. ఆరెండు పదవుల పంపిణి పూర్తవ్వడంతో ఇటు ఆర్ధికంగా, అటు రాజకీయంగా ఉపయోగపడే కీలక పదవుల పై కన్నేశారు గ్రేటర్ కార్పోరేటర్లు.

రాజకీయాల్లో ఒక్కో మెట్టూ జాగ్రత్తగా ఎక్కాలి. ఎన్నికల్లో గెలిచాక.. కొంచెం పెద్ద పదవి కోసం పోటీ పడాలి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లంతా ఇదే పనిలో ఉన్నారు. అదే స్టాండింగ్‌ కమిటీ మెంబర్. ఈ పదవుల కోసం కార్పోరేటర్లు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 150 డివిజన్లకు కొత్త కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకుంది. రెండు పదవులు ఆశించిన చాలా మంది సీనియర్ కార్పొరేటర్లు ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు అయిందేదో అయిపోయిందని స్టాండింగ్ కమిటీ పదవుల పై గురిపెట్టారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో స్టాండింగ్‌ కమిటీకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. గ్రేటర్ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం జరగాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం ఉండాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే స్టాండింగ్ కమిటీ మెంబర్ అంటే పెద్ద పోస్ట్ కిందే లెక్క. వాస్తవానికి మున్సిపల్ చట్టం ప్రకారం 10 మంది కార్పొరేటర్లకు ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్‌ ఉంటారు. ఈ లెక్కన ప్రస్తుతం సభలో 56 మంది టీఆరెస్, 47 మంది బిజెపి, 44 మంది ఎంఐఎం సభ్యులు ఉన్నారు. అంటే 5 లేదా ఆరుగురికి టీఆర్ఎస్ కోటాలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశం దక్కనుంది.

బిజెపి, ఎంఐఎంలకు చెరో నాలుగు నాలుగు స్టాండింగ్ కమిటీ సభ్యత్వాలు దక్కనున్నాయి. గత గ్రేటర్ కౌన్సిల్‌లో టీఆర్‌ఎస్, ఎంఐఎంకు మాత్రమే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు. దీంతో ప్రతి సభ్యునికీ ఏడాది కాలం అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత కొత్త వాళ్లకు ఛాన్స్‌ ఇచ్చారు. మరి, ఈసారి ఎలా ఇస్తారో చూడాలి. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశం కోసం ఇప్పటికే చాలా మంది సీనియర్ కార్పొరేటర్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని ఈ పదవులు వరిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version