ఐపీఎల్‌ మినీ వేలంలో సంచలనాలు అందుకేనా

-

సంచలనాలకు వేదికైన ఐపీఎల్‌-2021 వేలం ముగిసింది. 145 కోట్లు..57 మంది ఆటగాళ్లు..8 ప్రాంఛైజీలు ఒకరికి మించి ఒకరు వ్యూహాలు.. ఐపీఎల్‌ వేలంలో ఈసారి కూడా సంచలనాలు నమోదయ్యాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు సౌతాఫ్రికా ఆటగాగడు క్రిస్ మోరిస్‌ అమ్ముడయ్యాడు. ఇక ఆన్‌క్యాప్ ప్లేయర్‌ షారూఖ్‌కాన్‌ను ప్రతీజింటా ఐదున్నర కోట్లకు దక్కించుకోవడం హైలెట్‌. ఇటు సచిన్‌ కొడుకు అర్జున్‌ టెండుల్కర్‌ను ముంబై తీసుకుంది. ఐపీఎల్ ఆక్షన్ సంచలనాలు ఇప్పుడు ఆసక్తిరేపుతున్నాయి.

ఐపీఎల్‌ మినీ వేలంలో పాత రికార్డులు బద్ధలయ్యాయి. భారీ ధరలు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. ఐపీఎల్‌ చరిత్రలో మొదటిసారి క్రిస్‌ మోరిస్‌ అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. ఈ సౌతాఫ్రికా ఆటగాడిని రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఏకంగా 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక న్యూజిలాండ్‌ బౌలర్ జేమ్సన్‌ కోసం ఆర్సీబీ 15 కోట్లు ధారపోసింది. ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను కూడా ఆర్సీబీ యే 14 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో పంజాబ్‌ తరపున ఆడిన మ్యాక్స్‌వెల్‌ కనీసం ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేదు. ఇక బిగ్‌బాష్ సంచలనం రిచర్డ్‌సన్‌ను 14 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. ఇదే ఆటగాడిని గత ఐపీఎల్‌లో ఏ టీమ్‌ కూడా కొనుగోలు చేయలేదు. అదే ప్లేయర్‌ కోసం ఇప్పుడు అన్ని టీమ్‌లు ఎగబడ్డాయి.

ఇక ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీకి కూడా ఈసారి భారీ ధర దక్కింది. మోయిన్‌ అలీని చెన్నై సూపర్‌కింగ్స్‌ టీమ్‌ 7 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక దేశీ ఆల్‌రౌండర్‌ శివం దూబేనను రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగు కోట్ల 40 లక్షల రూపాయలకు దక్కించుకుంది. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హాసన్‌ను 3 కోట్ల 20 లక్షలకు కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండు కోట్ల 20 లక్షలకు ఢిల్లీకి అమ్ముడుపోయాడు.

ఐపీఎల్ వేలంలో దేశీ కుర్రాళ్లు కూడా సత్తా చాటారు. జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌ రికార్డు క్రియేట్ చేశాడు. అతన్ని 9.25 కోట్లు పెట్టి చెన్నై కొనుగోలు చేసింది. ఇక మరో సంచలనం అన్‌క్యాప్‌ ప్లేయర్‌, తమిళనాడు యువ ఆటగాడు షారుక్‌ ఖాన్‌ను 6.95 కోట్లకు దక్కించుకుంది పంజాబ్‌. ఈ ఆల్‌రౌండర్ కోసం మూడు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కానీ చివరకు ప్రముఖ నటి ప్రీతీ జింటా నేతృత్వంలోని పంజాబ్‌ షారుఖ్ ఖాన్ ని సొంతం చేసుకుంది. వేలంలో గెలిచామంటూ ప్రీతీ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

చెన్నై విడుదల చేసిన వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది. ఇక తెలుగు కుర్రాడు హరిశంకర్‌ రెడ్డిని చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 లక్షలకు తీసుకుంది. ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన మొత్తంలో దాదాపుగా సగం పైగా ఐదుగురు ఆటగాళ్లకే పోయింది. మోరిస్‌, జేమిసన్‌, మాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, కృష్ణప్ప గౌతమ్‌ల మొత్తం ధర రూ.68.75 కోట్లు. 2013 నుంచి ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్‌ వేలంలో అంతా ఆల్‌రౌండర్లే అత్యధిక ధర పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version