పాపికొండల నడుమ ఆనందంగా సాగుతున్న పడవప్రయాణం.. ఎవరిమాటల్లో వారున్నారు. ఆనంద క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి ఒడిలో పరవశించి.. తమనుతాము మైమరిచిపోతున్నారు.. ఒక్కసారిగా ఏదో తెలియని కుదుపు.. పడవ అదుపుతప్పింది.. తరుముకొస్తున్న వరదలో పట్టుతప్పింది. అది సుడిగుండం.. ఊహించని గండం.. ఏం జరుగుతుందో తెలియదు.. ఎటుచూసినా నీరే.. గోదారి దరి దరిదాపుల్లోనూ లేదు. ఒక్కసారిగా ఆర్తనాదాలు.. అరుపులు.. కేకలు.. తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తూనే.. మరొకరిని కాపాడేందుకు ఆరాటం.. నేను చనిపోయినా పరవాలేదు.. నా భార్యాపిల్లలు బతకాలి.. నేను చనిపోయినా పరవాలేదు.. నా స్నేహితుడు బతకాలి.. నేను ఈ వరదలో కొట్టుకుపోయినా సరే.. నా వాళ్లు మాత్రం బతకాలి.. ఇలా ఒకరి ప్రాణాలు మరొకరి కోసం ఆ సుడిగుండంలో తల్లడిల్లాయి. దాని నుంచి కొందరు బయటపడితే..మరెందరో గల్లంతయ్యారు.
పాపికొండల నడుమ గోదావరిలో జరిగిన ఈ పడవ ప్రమాదం ఎన్నో కుటుంబాలకు గుండెకోతను మిగిల్చింది. ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ఎవరిని కదిలించినా కన్నీటి వరదే వస్తోంది. ఎవరిని పలకరించినా.. బరువెక్కిన హృదయమే. తూర్పు గోదావరి జిల్లా కచలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో భర్త, కూతురు గల్లంతుకాగా.. ఒంటరిగా మిగిలిపోయిన ఆమె రోదన అందరి హృదయాలను ద్రవించివేస్తోంది. అయ్యో దేవుడా.. వారు క్షేమంగా తిరిగిరావాలంటూ అందరూ వేడుకుంటున్నారు. తిరుపతి నగరానికి చెందిన దంపతులు దుర్గం సుబ్రహ్మణ్యం (45), మధులత. వారికి ఓ పన్నెండేళ్ల కుమార్తె హాసిని ఉంది. వీరు తిరుపతిలోని అక్కారంపల్లి వినాయకసాగర్ సమీపంలోని రాథేశ్యామ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి సమీపంలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు.
భార్యాకూతురిని కాపాడేందుకు..
సుబ్రహ్మణ్యం తండ్రి గంగిశెట్టి 3 నెలల క్రితం మృతిచెందారు. తండ్రి అస్థికలను నదిలో కలపాలని సుబ్రహ్మణ్యం శనివారం ఉదయం ఆయన భార్య, కుమార్తెతో కలసి తిరుపతి నుంచి బయలుదేరి వెళ్లారు. లాంచీలో పాపి కొండలకు బయలుదేరారు. అయితే.. వాళ్లు ఎక్కిన పడవ పాపికొండలకు వెళ్తూ కచలూరు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పింది. పడవ నీటిలో మునుగుతుండగా.. సుబ్రహ్మణ్యం వెంటనే మధులతను బోటులోకి తోసి తాను వేసుకున్న లైఫ్‌జాకెట్‌ను అందించాడు. ఆ వెంటనే కూతురిని కూడా ఆమెకు అందించాడు. కుమార్తె హాసిని తల్లి మధులత కాలు పట్టుకుంది. అయితే.. మధులత అందుకునే లోపే హాసిని జారిపోయింది. ఇటు తిరిగి చూస్తుండగానే భర్త సుబ్రహ్మణ్యం నీటిలో మునిగిపోయాడంటూ మధులత ఘటనా స్థలంలో గుండెలవిసేలా రోదించింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
అయ్యో హాసిని..
సుబ్రహ్మణ్యం-మధులత దంపతులు శనివారం వెళ్లాలని శుక్రవారమే ఏర్పాట్లు చేశారు. అయితే… అక్కడిని నేను రానంటూ హాసిని మొండికేసింది. 14వ తేదీ రెండో శనివారం కావడంతో హాసిని చదువుతున్న పాఠశాలవారు పిల్లలను తిరుపతి జూపార్క్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. తోటి విద్యార్థులతో కలిసి జూ పార్క్‌కు వెళ్తానని హాసిని చెప్పింది. అయినా.. ఆమెకు నచ్చజెప్పి తీసుకెళ్లామని మధులత కన్నీటిపర్యంతమవుతోంది. అయ్యో దేవుడా.. ఇలాంటి కష్టం మరెవ్వరీ రావద్దంటూ ప్రజలు వేడుకుంటున్నారు.