గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉభయ గోదావరి జిల్లాలలో లంకభూములు, పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళనలో మునిపోయారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ని గ్రామాలు వరద నీట మునిపోయాయి. దీంతో అక్కడి ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు దగ్గర వరద కొనసాగుతోంది. ఇప్పటికే కాఫర్ డ్యాం వద్ద 29 మీటర్లకు వరద చేరింది. పాత పోలవరం దగ్గర ఉన్న నెక్లెస్ బండ్ కోతకు గురవుతోంది.
ఇక తూర్పు గోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం బడుగువానిలంక వద్ద గోదావరి ఉధృతికి భూములు కోతకు గురవుతున్నాయి. కొబ్బరి చెట్లు కూడా గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బాధితులన పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, వివిధ శాఖల అధికారులతో 32 బృందాలు ఏర్పాటు చేసి జిల్లాలో 24గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.