ఇటీవలి వరుస రికార్డుల తరువాత… ఇప్పుడు బంగారం ధరలు ఊహించని తట్టెలా పడిపోతున్నాయి. దేశీయ మార్కెట్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తూ, గురువారం ఒక్కరోజే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.2,180 మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.95,730కి చేరుకుంది. గత పది రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ.5,000 తగ్గిన సంగతి గమనార్హం. ఇంత భారీ పతనానికి కారణం ఏంటి? విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయంగా మైనస్ ఒత్తిళ్లు తగ్గాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సద్దుమణగడం, రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రారంభమవుతుండడం వంటి అనేక అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 3,236.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇదే సమయంలో, డాలర్ బలపడటం కూడా బంగారం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. సాధారణంగా బంగారం “సేఫ్ హేవన్” అని పిలవబడుతుంది కానీ డాలర్ స్ట్రాంగ్ అయితే దాని మీద పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది. అందుకే వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంచనాల ప్రకారం, త్వరలో విడుదలయ్యే అమెరికా ఆర్థిక గణాంకాలు ఈ ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశముంది. కానీ… ఇదిలా ఉండగా, అక్షయ తృతీయను మాత్రం పసిడి కొనుగోళ్ల పండుగగానే జరుపుకున్నారు భారతీయులు! బంగారం ధరలు పెరిగినా వినియోగదారులు వెనకడుగు వేయలేదు. ఆలిండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ అసోసియేషన్ ప్రకారం, ఆ రోజు ఒక్కటే దాదాపు 12 టన్నుల బంగారం, రూ.4,000 కోట్ల విలువైన వెండి అమ్ముడై, మొత్తం ట్రాన్సాక్షన్ రూ.16,000 కోట్లు దాటినట్లు అంచనా..