దసరా పండుగ సందర్భంగా అర్చకులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తూ.. కనీస వేతనం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలో ఉన్న 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు కానుంది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 మే నెలలో జారీ చేసిన జీవోకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమకు కనీస వేతనాలు అమలు చేయడంపై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమ ఛైర్మన్‌గా పేరి కామేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన కోనసీమ జిల్లా అంబాజీపేట వాసి. కామేశ్వరరావు నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభివృద్ధికి తన వంతు కృకృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.