కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, వంశీల మధ్య మెసేజ్ లు, లేఖలు కూడా నడిచాయి. చివరకు చంద్రబాబు వంశీకి అండగా ఉంటానని చెప్పడంతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులను వంశీని బుజ్జగించేందుకు పంపారు.
బుధవారం అర్ధరాత్రి విజయవాడ ఎంపీ నాని నివాసంలో అర్ధరాత్రి దాటే వరకు వీరు వంశీతో జరిపిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. తనతో పాటు తన అనుచరులపై కేసుల విషయాన్ని ప్రస్తావించిన వంశీ… తనకు జిల్లా పార్టీ నుంచి కూడా ఎప్పుడూ ఎలాంటి సపోర్ట్ లేదన్న అంశం సైతం ప్రస్తావించారట. ఇక
టీడీపీలో కొనసాగేందుకు వంశీ సుముఖత చూపలేదు.
ఇక తనకు బంధువు అయిన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కూడా వంశీ చర్చలు జరపడంతో… ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ సందేహాలకు వంశీ ఫుల్ స్టాప్ పెట్టారు. నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు. దీంతో నాలుగైదు రోజులుగా నడుస్తోన్న ఈ డ్రామాకు తెరపడింది.
ఇక వంశీ ఎంట్రీపై క్లారిటీ రావడంతో ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే సైతం ఇప్పుడు వైసీపీ బాటలోనే నడిచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. వైసీపీలో ఉన్న రవికుమార్ 2014లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసేశారు.
జగన్ దగ్గర రవికి ఎప్పుడూ మంచి ప్రయార్టీ ఉండేది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకే చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉంది. అయితే అదే జిల్లాకు చెందిన వైవి.సుబ్బారెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే ఇప్పుడు రవి వైసీపీ రీ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నా బాలినేని, జగన్‌కు ఓకే అయితే ఆయన కూడా వైసీపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.