కరోనా వైరస్ విస్తరిస్తున్నా సరే కొందరిలో మాత్రం భయం అనేది ఉండటం లేదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొందరు. ముఖ్యంగా మాంసం దుకాణాల వద్ద బారులు తీరడం ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా భయపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. జనాలు ఇలా చికెన్ మటన్ కోసం ఒకరి మీద ఒకరు పడటం తో వ్యాపారులు ధరలను భారీగా పెంచడం చూస్తున్నాం. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
తెలంగాణాలో పరిస్థితి అదుపులోకి వచ్చినా సరే ప్రభుత్వం భయపడుతుంది. చికెన్ మటన్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇష్టం వచ్చినట్టు అమ్మితే చర్యలు తప్పవు అని హెచ్చరించింది. కిలో మటన్ ధర రూ.700కే అమ్మాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. పశు సంవర్థక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్ డాక్టర్ బాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దుకాణాల ముందు ధర తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మాంసం ధరలపై గత రెండు వారాలుగా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనితో అధికారులు రంగంలోకి దిగారు. మంత్రి తలసాని ఆదేశాల మేరకు మాంసం ధరల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటి హైదరాబాద్ వ్యాప్తంగా పర్యటించి పరిస్థితిని ఆరా తీసింది.