ఓటీటీల ఇష్టారాజ్యం ఇక కుదరదా..?

-

సెన్సార్ లేకపోవడాన్ని అవకాశంగా మలుచుకుని.. ఇష్టారీతిగా వెబ్ సిరీస్ లు విడుదల చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు కేంద్రం చెక్ పెట్టింది. ఇకపై వీడియోలు వర్గీకరించాలని నిర్దేశించింది. అటు సోషల్ మీడియాలో అబద్ధపు వార్తలపై కూడా కన్నెర్ర చేసింది.ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫాంలపై విడుదలయ్యే సినిమాలపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. దీంతో ఓటీటీల ఇష్టారాజ్యం ఇక కుదరదా అన్న చర్చ నడుస్తుంది.

ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు వివాదాస్పదమౌతున్నాయి. అశ్లీలత, అసభ్యత దట్టించి కంటెంట్ వదులుతున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లపై కోర్టు కేసులు, కొన్ని రాష్ట్రాల్లో గొడవలు కూడా అయ్యాయి. దీంతో వెబ్ సిరీస్ ల కంటెంట్ ను నియంత్రించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తుండటంతో భారత ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ ల పై నియంత్రణ విధించేందుకు కొన్నాళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది.

ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డిజిటల్ న్యూస్ పేపర్లు ప్రెస్ కౌన్సిల్ చట్టం పరిధిలోకి గానీ, సెన్సార్ బోర్డు పరిధిలోకి గానీ, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నియంత్రణ చట్టం కిందకు కానీ రావు. దాంతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఏ కంటెంట్ సినిమాలైనా, వెబ్ సిరీస్‌ని అయినా, పేపర్లు అయినా పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ మధ్యకాలంలో చాలా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా ఇటీవల తాండవ్ వెబ్ సిరీస్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో కేంద్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై విడుదలయ్యే వెబ్ సిరీస్ లపై నియంత్రణ విధించేందుకు కసరత్తు ప్రారంభించింది.

ఇటీవల ఓటీటీ ప్లేట్ ఫామ్స్ ,యూట్యూబ్ చానల్స్ లో ఉన్నకంటెంట్ అసభ్యకరంగా ఉండడంతో వ‌రుస‌గా ఫిర్యాదులు వ‌చ్చాయి. ఈ తరుణంలో కేంద్రం కొరడా ఝుళిపించింది. యూట్యూబ్, ఓటీటీలు కొత్తగా చానెల్స్ ఓపెన్ చేయాలంటే ప్రభుత్వ అనుమ‌తి తప్పనిస‌రి చేసింది.అంతేకాదు ఆయా చానెళ్ళలో ప్రసారమయ్యే అన్ని వీడియోల‌ను స‌మాచార శాఖ కింద‌కు తెస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి ఆన్ లైన్ చానెల్స్ , ఓటీటీ ప్లేట్ ఫామ్స్ పై కేంద్రం నిఘా పెట్టనుంది.

ఓటీటీ వీడియోలపై నియంత్రణ కోసం కేంద్రం మూడంచెల విధానం తీసుకొచ్చింది. మొదటి దశలో.. ప్రతి ఓటీటీ సంస్థ అంతర్గతంగా స్వీయ నియంత్రణ కింద ఓ అధికారిని నియమిస్తుంది. రెండో దశలో స్వీయ నియంత్రణ వ్యవస్థలున్న ఓటీటీ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఉంటుంది. మూడో దశలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. ఓటీటీ కంటెంట్ పై వచ్చే అభ్యంతరాలపై రిటైర్డ్ జడ్జి కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా.. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే నియంత్రణ వ్యవస్థ తుది నిర్ణయం తీసుకుంటుంది.

మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో ప్రజలంతా వినోదం కోసం అనేక ఓటీటీ వేదికలను ఆశ్రయించారు. అయితే వెబ్‌ సిరీస్‌ల ప్రసారానికి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇప్పటిదాకా రాలేదు. ఫలితంగా వీటిలో శృంగారం, అసభ్యపదజాలం, అశ్లీలత, హింస, అక్రమసంబంధాలు వంటి వాటికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. దీంతో వీటికి కళ్లెం వేయాలని సుప్రీం కోర్టును కొందరు ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version