గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారి… ఆమోదించిన గవర్నర్…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ వీడింది. తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రభుత్వం మధుసూదనాచారి పేరును పంపింది. ప్రభుత్వం పంపించిన పేరును గవర్నర్ ఆమోదించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. గతంలో గవర్నర్ కోటా కింద పాడి కౌషిక్ రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. దీంతో పాడి కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించగా… మధుసూదనాచారి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటున్నారు సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణ తొలి సభాపతిగా మధుసూదనాచారి పనిచేశారు. 2014 ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా.. 2019 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత.. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి సిరికొండ ఏదో పదవిని ఆశిస్తున్నారు. తాజాగా ఆయన ఆశ నెరవేరింది.