ప్రపంచంలోనే ఒక అద్భుతమైన యాత్రగా అమర్‌నాథ్‌యాత్రకు పేరుంది. పరమ పవిత్రంగా భావించి వేలాదిమంది ఈ సహసయాత్రకు ఏటా వెళ్తారు. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులతో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం యాత్రికులకు హెచ్చరికలు జారీచేసింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు, ఇతర పర్యాటకులు వెంటనే తిరుగుముఖం పట్టాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం సూచించింది. అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
పర్యాటకులపై, ప్రత్యేకంగా అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రమూకలు దృష్టి సారించినందున వీలైనంత త్వరగా వెనుదిరగాలని ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. అమర్‌నాథ్ యాత్రలో హింసను సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని కొంత సేపటి క్రితం భారత ఆర్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దారిలో కొన్ని చోట్ల మందు పాతరలు, స్నిపర్ రైఫిళ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆయుధాలపై పాకిస్థాన్ ఆయుధాగారానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఇంకా గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కుట్రకు పాక్ ఆర్మీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలిపారు. ఇక్కడ అశాంతి నెలకొల్పాలనే పాక్ సైన్యం ప్రయత్నాలను సాగనీయబోమని హెచ్చరించారు.
– కేశవ