గత ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ కోసం నిర్మించిన హరిత హోటళ్లు నేడు బార్ అండ్ రెస్టారెంట్లుగా మారనున్నట్లు తెలుస్తోంది.నష్టాల బారి నుంచి బయటపడటం,ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత నూతన టూరిజం పాలసీలో భాగంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచడం, నష్టాల్లో ఉన్న హోటళ్లను లాభదాయకంగా మార్చడం కోసం పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నవి మినహా మిగతా ప్రాంతాల్లోని దాదాపు అన్ని హరిత హోటళ్లు త్వరలోనే మద్యం, మాంసాహార సరఫరాకు కేంద్రాలుగా మారనున్నాయి.
హరిత హోటళ్లకు ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ప్రైవేటు సంస్థలకు లీజు రూపంలో, ఇతర మార్గాల ద్వారా అప్పగిస్తే… ఇటు నిర్వహణ నష్టాల నుంచి బయటపడటంతోపాటు అదనంగా ఆదాయం సమకూరుతుందని పర్యాటకశాఖ అధికారులు ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో ఆబ్కారీ శాఖకు లైసెన్స్ ఫీజులతోపాటు మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూరుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం.