టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై స్పందించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… అవినీతికి ప్యాంట్, షర్ట్ వేస్తే చంద్రబాబులా ఉంటుందని ఎద్దేవా చేశారు. తన శేష జీవితంలో టీడీపీ అధినేత కర్మఫలం అనుభవించక తప్పదన్నారు. అవినీతి కేసుల నుండి బయటపడేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్నారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల సందర్భంగా ఆయన కూర్చున్న తీరు ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాపం పండిందన్నారు.
హెరిటేజ్ వ్యాపారంతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారా? అని ప్రశ్నించారు. హిందూస్థాన్ టైమ్స్ కథనంతో చంద్రబాబు అవినీతి బహిర్గతమైందన్నారు. చంద్రబాబు ఏ విధంగా అక్రమమార్గంలో డబ్బులు సంపాదించారనే అంశంపై కథనం ప్రచురించారని తెలిపారు. తనకు అవినీతి అంటేనే తెలియదని చెప్పే చంద్రబాబు ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణల మీద ఎందుకు నోరు మెదపడం లేదని, ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. అవినీతిలో ప్రమేయం ఉంది కాబట్టే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. రెండెకరాల నుండి రూ.1 లక్ష కోట్లకు ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబు పిండింది ఆవు పాలో.. గేదె పాలో కాదని, రాష్ట్ర ఖజానాను అన్నారు.