జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో దశ వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. నేడు పవన్ కల్యాణ్ మంత్రి అమర్నాథ్ ఇలాఖాలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ కౌంటర్ అటాక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ విస్సన్నపేట సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారు అంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు..
రుషికొండ పేలిపోయి జగన్మోహన్ రెడ్డి అందులో కూరుకుపోవాలనే పవన్ వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవి అంటూ మంత్రి అమర్నాథ్ దుయ్యబట్టారు.. రుషికొండలో ఎటువంటి ఉల్లంఘణలు కనిపించక వెనక్కి తిరిగొచ్చారన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ వంటి రియల్ లైఫ్ హీరోను చూసి.. ఈర్ష్య ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలి..? అని ప్రశ్నించారు. ప్రజానాయకుడైన జగన్ స్థాయిలో కథా నాయకుడైన పవన్ ను ఒకే స్థాయిలో జనం చూస్తారు అనుకుంటే అమాయకత్వమే అవుతుందంటూ సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్.
ఇక, పవన్ కల్యాణ్ కీచక గురువుగా మారాడు అంటూ ఫైర్ అయ్యారు గుడివాడ అమర్నాథ్.. యువకులను సినిమా అనే ట్రాన్స్ లోకి తీసుకెళ్లి విచ్చలవిడిగా వాడుకుంటున్నారన్న ఆయన.. నాయకులు, కార్యకర్తలను మూట కట్టేసి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ సిద్ధం అయ్యారని విమర్శించారు. నాపై, మా ప్రభుత్వం మీద దోపిడీ దారులు అనే ముద్ర వేసేందుకు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటూ తిప్పికొట్టారు. తరతరాలుగా రాజకీయాల్లో ఎదిగిన వాళ్లం.. మేం ప్రజలకు, ప్రభుత్వానికి కస్టడీయన్ గా వ్యవహరిస్తోందన్నారు. విశాఖ భూ అక్రమాలపై త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు ఉంటాయని ప్రకటించారు.