Independence Day : ఎర్రకోట వేడుకల్లో తుపాకులతో ‘గన్‌ సెల్యూట్‌’

-

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 21 తుపాకులతో చేసే గన్‌ సెల్యూట్‌కు (21-Gun Salute) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన తుపాకులను ఉపయోగించనున్నారు. ఇందుకోసం భారత రక్షణ పరిశోధనా సంస్థ  అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ టోవుడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టమ్‌ ఫిరంగులను ఉపయోగించనున్నట్లు రక్షణశాఖ సెక్రటరీ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దిల్లీలోని ఎర్రకోటలో జరిగే కార్యక్రమంలో గన్‌ సెల్యూట్‌ కోసం ఇప్పటివరకు బ్రిటిష్‌ తుపాకులనే వాడుతున్నారు. ఈ ఏడాది మాత్రం వాటితోపాటు స్వదేశీ పరిజ్ఞానంతో (డీఆర్‌డీఓ) తయారు చేసిన ఏటీఏజీఎస్‌ తుపాకులను వాడుతామని రక్షణశాఖ కార్యదర్శి వెల్లడించారు. అయితే, సాధారణంగా దేశ సరిహద్దుల్లో ఉపయోగించే వీటిని.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల్లో ఉపయోగించేందుకు వీలుగా ఏటీఏజీఎస్‌ తుపాకులకు కొన్ని మార్పులు చేశామన్నారు. పుణెలోని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలతోపాటు ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.

విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను భారత రక్షణ శాఖ అభివృద్ధి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు భారత సైన్యంలో ఉపయోగిస్తోన్న పాత ఫిరంగుల స్థానంలో అధునాతన 155ఎంఎం ఆర్టిలెరీ తుపాకులను ఏర్పాటు చేసే ఏటీఏజీఎస్‌ ప్రాజెక్టుకు డీఆర్‌డీఓ 2013లో శ్రీకారం చుట్టింది. దీన్ని ఆర్టిలెరీ కంబాట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, ఫైర్‌ ప్లానింగ్‌ వంటి సీ4ఐ వ్యవస్థలకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం సులువుగా ఛేదించేలా తయారు చేసిన ఈ ఏటీఏజీఎస్ తుపాకీ ప్రయోగాలు గతంలోనే విజయవంతంగా పూర్తయ్యాయి.

మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎన్‌సీసీ క్యాడెట్‌లను ఆహ్వానించామని రక్షణశాఖ సెక్రటరీ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. క్యాడెట్లతోపాటు అంగన్‌వాడీ వర్కర్లు, వీధి వ్యాపారులు, ముద్ర రుణాలు పొందినవారు, మార్చురీ వర్కర్లతోపాటు ఆయా రంగాల్లో చేస్తోన్న సేవలకు గుర్తుగా పలు విభాగాలకు చెందిన వారిని కూడా ఆహ్వానించామన్నారు. వీరికి అదనంగా 14 దేశాలకు చెందిన 127 మంది క్యాడెట్లనూ ఈ వేడుకలకు ఆహ్వానించామని రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version