జుట్టు పెద్దగా ఉంచుకోవాలని ఆడవాళ్ళు బాగా ఆశపడతారు. ఐతే వాళ్ళు ఆశపడితే సరిపోదుగా! వాళ్ళకి కావాల్సినంత జుట్టూ ఉండాలి. చాలామందికి జుట్టు ఎక్కువ పొడవు పెరగదు. కొద్దిపాటి పొడవు పెరిగి ఆగిపోతుంది. అదే మరికొంతమందికి జుట్టు ఎక్కువ పొడవు ఉంటుంది. పొడవు జుట్టు ఉన్న ఆడవాళ్ళని పొట్టి జుట్టు ఉన్న కొందరు ఆడవాళ్ళు చూసి అసూయ పడుతూ ఉంటారు. తమకూ అలా ఉండాలని అనుకుంటారు. ఐతే ఎన్ని షాంపూలు వాడినా ఓ మోస్తారు పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. అలా పెరుగుతూ ఎందుకు వెళ్ళదు? అనే విషయాలని ఈరోజు తెలుసుకుందాం.
జుట్టు పొడవుగా పెరగడం వెనక చాలా కారణాలున్నాయి. ఎవ్వరి జుట్టైనా సరే కత్తిరించుకున్న చాలా తొందరగా పెరిగినట్టు అనిపిస్తుంది. నిజానికి పెరుగుతుంది కూడా. ఒక నెలలో అర అంగుళం వరకు జుట్టు పెరుగుతుంది. ఐతే ఆ పెరుగుదల ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఒక నిర్దిష్ట పెరుగుదలకి చేరుకున్నాక ఆ జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. అలా అవడానికి కారణం మన మెదడే. అవును, జుట్టు పెరుగుతూ ఉండకుండా నిర్దిష్ట పొడవుకి రాగానే పెరుగుదల ఆపేస్తుంది. దానికోసం రక్తాన్ని వెంట్రుకలకి అందించదు.
ఈ పెరుగుదల ఒక్కో వెంట్రుకకి ఒక్కోలా ఉంటుంది. ప్రతీ వెంట్రుక పెరుగుదల దేనికదే విభిన్నంగా ఉంటుంది. అందువల్ల అన్ని వెంట్రుకలు ఒకేలా పెరగవు. నిర్దిష్ట పెరుగుదలకి చేరుకున్న కొన్ని వెంట్రుకులు ఊడిపోతున్న సమయంలో ఇతర వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకి పెద్దగా తేడా కనిపించదు. దీన్నిబట్టి ఎన్ని షాంపూలు పెట్టినా జుట్టు పెరుగుదల ఓ మోస్తారు వరకే ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ మోస్తారు పెరుగుదల అనేది వారి వారి జీన్స్ మీద కూడా అధారపడి ఉంటుంది.
కాబట్టి ఎంతమంచి బ్రాండ్ షాంపూలు వాడినా ఫలితం పెద్దగా ఉండదన్నట్టే. కాకపోతే షాంపూలు వాడడం వల్ల నిర్దిష్ట పెరుగుదలకి తొందరగా చేరుకునే అవకాశం ఉంది.