ఆంధ్రా, తెలంగాణ అంటూ ఉమ్మడి ఆంధ్ర విడిపోయింది. ఆ విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ సంబంధిత సమస్యలు అన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆస్తులు, అప్పుల గొడవ తీరనే లేదు. విడిపోయేటప్పుడు, తరువాత కూడా కొన్ని విషయాలు ఇవాళ్టికీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ రోజు రాష్ట్రం విడిపోయాక తొలినాళ్లలో ఆంధ్రా నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా అయింది.
వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లింపు చేయలేదు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా కొన్ని విష యాలు అన్ సాల్వ్డ్ వెర్షన్ లోనే ఉన్నాయి. ఆ రోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణకు ఏపీ నిధులు ఇచ్చింది. అవి కూడా ఇవాళ్టికీ చెల్లింపు చేయలేదు. ఇవన్నీ ఇలా ఉంటుండగానే జలవివాదాలన్నవి రెండు రాష్ట్రాలనూ కదిపి కుదిపేశాయి.
ఈ తరుణంలో కొత్త వివాదాలు పుట్టుకురాకుండా రెండు తెలుగు రాష్ట్రాల పెద్దలూ మాట్లాడుకోవాల్సినంత మాట్లాడుకోవడం లేదు. పాత వివాదాలు పరిష్కారం చేసుకోవడం లేదు. ఇదే సమయంలో కేంద్రం జోక్యం కూడా పెద్దగా లేదు. ఇవన్నీ ఇలా ఉంటుండగానే జిల్లాల విభజన అంటూ కొత్త వివాదం ఒకటి తెరపైకి తెచ్చారు జగన్. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న విషయాలు ఇవి.. వీటిపై మొన్నటి వేళ ఆన్లైన్ మీటింగ్ కూడా జరిగింది.
ఇక ఐదు అంశాలు ప్రస్తావనలోకి రానున్నాయి ఇవాళ అవేంటో చూద్దాం..
– ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
– ఏపీ జెన్ కో కు తెలంగాణ డిస్కమ్ లు చెల్లించాల్సిన బకాయిలు
– పన్ను అంశాలపై తలెత్తిన లోపాల పరిష్కారం
– బ్యాంకులోని నగదు,డిపాజిట్ల పంపిణీ
– ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ (A P State Civil Supplies Corporation Limited) కు,తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ (The Telangana State Civil Supplies Corporation Limited (TSCSCL))కు సంబంధించి ఉన్న నగదు అంశం.
– విభజన సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలకూ ఒకే పౌరసరఫరాల అధికారి పనిచేశారు అని,ఆ రోజు తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించారని ఇందుకు తమ రాష్ట్ర నిధులు ఖర్చుచేశారని, వాటిని వెనక్కు ఇప్పించాలని కోరుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికారులు.
– వీటితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంకొన్ని విషయాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన అంశంపై ఏ నిర్ణయం వెలువడనుందో అన్న ఆసక్తి ఒకటి ఇరు వర్గాల్లోనూ నెలకొని ఉంది. వీటితో పాటు హైద్రాబాద్ లో ఉన్న ఏపీ ఆస్తులపై ఆర్థిక లెక్కలు,హక్కులు, ఇంకా ఉమ్మడి ఆస్తుల్లో వాటాలు అన్నీ తేలాల్సి ఉన్నాయి.
ఇవేవీ తేలకుండానే మొన్నటి వేళ ఆన్లైన్ మీటింగ్ ముగిసిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటుండగానే అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కారం కాకపోగా రోజురోజుకూ కొన్ని వివాదాలు జఠిలం అవుతున్నాయి.ఇదే సమయంలో అంతర్ జిల్లాల వివాదాలు కూడా రేగేందుకు రేపటి వేళ అవకాశాలు ఉన్నాయి.జిల్లాలు, శాఖల పరంగా కార్యాలయాల ఏర్పాటు, పని విభజన ముఖ్యంగా సిబ్బంది విభజన అన్నవి పెద్ద తలనొప్పిగా మారనున్నాయి.
అన్నింటికన్నా మించి కార్యాలయాల ఏర్పాటు.. కలెక్టరేట్ల ఏర్పాటు అన్నవి కూడా చాలా చోట్ల సవాలుగా పరిణమించనున్నాయి.వీటిని అధిగమించాలంటే కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులు కావాలి. ఉన్నపళాన నిధులు ఇచ్చి కార్యాలయాలు నెలకొల్పేందుకు అవకాశాలే లేవు కనుక ఉన్నవాటితోనే,అరకొర వసతుల నడుమ రేపటి నుంచి మన రెవెన్యూ అధికారులు పనిచేయాలి.ఇంకా జిల్లాల హద్దులు, స్టేషన్ల పరిధి కూడా తేలాల్సి ఉంది. అవి కూడా పెద్ద తలనొప్పిగానే మారనున్నాయి.