ఫాక్స్‌కాన్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులలో ఎవర్ని కదిపినా కన్నీళ్లే పలకరిస్తాయి. ఒక్కొక్కరిది ఒక్కక్క దీనగాథ. సరైన ఇల్లు లేక పూరి గుడిసెలో, తీవ్రమైన నీటి సమస్యతో గడిపేది కొందరు మహిళలైతే, తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చే జీతం మొత్తాన్ని కుటుంబానికే ఇచ్చేసే పెళ్లికాని యువతులు కొందరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీ ప్రాంతం.. అక్కడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది.. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనే అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థకు చెందిన మొబైల్స్ తయారీ యూనిట్.. రోజుకు 3 షిఫ్టులు.. షిఫ్టు సమయం అవుతుందంటే చాలు.. ఆ కంపెనీకి చెందిన బస్సుల్లో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అనేక మంది మహిళలు, యువతులు అక్కడికి వస్తారు. కంపెనీ ఎంట్రన్స్ వద్ద కొన్ని వందల సంఖ్యలో ఉండే వారు ఒకరి వెనుక ఒకరు అటెండెన్స్ పంచ్ చేసి లోపలికి వెళ్తారు. లోపల వారు చేయాల్సిన పని ఒక్కటే. మొబైల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా.. అని.. అలా వారు 8 గంటల పాటు రోజూ అక్కడ వివిధ షిఫ్టుల్లో పనిచేయాలి. అంతా చేస్తే వారికి లభించేది కేవలం 4 డాలర్లు (దాదాపుగా రూ.300) మాత్రమే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో తయారయ్యే ఉత్పత్తులను అమెరికాలో అమ్మడంపై గతంలో పెద్ద మొత్తంలో సుంకాలను విధించారు. అయితే వాటిపై ఇటీవలే కొంత సడలింపు ఇచ్చారు. అయినప్పటికీ అమెజాన్, యాపిల్, గూగుల్ తదితర కంపెనీలు ట్రంప్ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని, తాము చాన్స్ తీసుకోకూడదని భావించి చైనాలో ఉన్న తమ ఫ్యాక్టరీలకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లో ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు పూనుకున్నాయి. ఇక ఈ విషయంలో యాపిల్ ఒక మెట్టు ముందే పైకి ఎక్కేసింది.
యాపిల్‌కు చెందిన ఐఫోన్లను చైనాలో ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు చేస్తుంది. అయితే చైనాపై విధించిన అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీలో యాపిల్ తన ఐఫోన్లను తయారు చేయాలని సంకల్పించింది. అందుకుగాను ఫాక్స్‌కాన్ తమ కంపెనీని విస్తరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీసిటీ ఫాక్స్‌కాన్‌లో ఇప్పుడు యాపిల్ ఐఫోన్ X ఫోన్లను తయారు చేస్తోంది. త్వరలో ఇక్కడ తయారైన ఈ ఐఫోన్లనే భారత్‌లో అమ్మడంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
అయితే మొబైల్స్ తయారీ యూనిట్‌లో పనిచేస్తున్నారనే కానీ.. ఆ మహిళలకు వచ్చే వేతనం చాలా తక్కువ. 8 గంటలపాటు ఒకే పని చేయాలి. నిత్యం 2 సార్లు కంపెనీ క్యాంటీన్‌లో ఉచితంగా భోజనం ఉంటుంది. బస్సు సదుపాయం ఉంటుంది. నైట్ షిఫ్టు వారి కోసం ఆ కంపెనీలోనే ఉండేందుకు ప్రత్యేకంగా డార్మిటరీలను ఏర్పాటు చేశారు. అయినా.. చైనాలో ఉన్న మొబైల్స్ తయారీ కంపెనీల్లో పనిచేసే సగటు కార్మికుడికి అందే జీతంలో ఇక్కడి మహిళలకు అందే వేతనం 1/3 వ వంతు మాత్రమే.
శ్రీసిటీతోపాటు ఇక్కడి సుమారుగా 2 గంటల ప్రయాణ దూరంలో శ్రీ పెరుంబుదూరులోనూ ఫాక్స్‌కాన్ కంపెనీ ప్లాంట్ మరొకటి ఉంది. అందులోనూ ఎక్కువగా మహిళలే కార్మికులుగా ఉన్నారు. శ్రీసిటీ ప్లాంట్‌ను 2015లో ఏర్పాటు చేయగా అందులో 15వేల మంది పనిచేస్తున్నారు. శ్రీ పెరుంబుదూరు ప్లాంట్‌ను 2017లో ఏర్పాటు చేయగా అందులో 12వేల మంది పనిచేస్తున్నారు. ఇక ఈ రెండు ప్లాంట్లలోనూ కలిపి మొత్తం వర్కర్లలో 90 శాతానికి పైగా కార్మికులు మహిళలే కావడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో షియోమీకి చెందిన ఫోన్లతోపాటు యాపిల్ ఐఫోన్లను కూడా తయారు చేస్తున్నారు. ఈ ప్లాంట్లలో పనిచేసే మహిళా వర్కర్లు ఫోన్లలో ఉండే కెమెరా, బ్యాటరీ, వాల్యూమ్, పవర్ బటన్లు, వైబ్రేషన్ తదితర అన్ని ఫీచర్లను టెస్ట్ చేసి అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ పనికి గాను ఫాక్స్‌కాన్ ఎప్పటికప్పుడు ఆ మహిళలకు పలు అంశాల్లో శిక్షణనిస్తూనే ఉంటుంది.
ఫాక్స్‌కాన్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులలో ఎవర్ని కదిపినా కన్నీళ్లే పలకరిస్తాయి. ఒక్కొక్కరిది ఒక్కక్క దీనగాథ. సరైన ఇల్లు లేక పూరి గుడిసెలో, తీవ్రమైన నీటి సమస్యతో గడిపేది కొందరు మహిళలైతే, తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చే జీతం మొత్తాన్ని కుటుంబానికే ఇచ్చేసే పెళ్లికాని యువతులు కొందరు. ఇక కొందరు మహిళలు తమ పిల్లలకు చక్కని చదువులు చెప్పించాలని, వారిని ప్రయోజకులను చేయాలని ఆరాట పడుతుంటారు. ఆ కంపెనీలో ఏ మహిళను పలకరించినా.. ఒక్కో కన్నీటి గాథ మనకు కనిపిస్తుంది. మనం విలాసవంతంగా వాడే ఫోన్ల వెనుక ఇలాంటి వారి కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వారి ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనమూ కోరుకుందాం..!