వర్షాకాలం ప్రారంభం కావడంతో తెలంగాణలో వరిసాగు పనులు జోరందుకున్నాయి. అయితే సాధారణ నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతిలో వరి సాగు లాభదాయకంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు harish rao రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా గురువారం సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి మంత్రి హరీష్ రావు… కొండపాక మండలంలోని ముద్దాపూర్ గ్రామ రైతులకు వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు.
ముద్దాపూర్ గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. మంత్రి స్వయంగా పొలంలోకి దిగి విత్తనాలు చల్లారు. వెదజల్లే పద్దతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 1-2 క్వింటాళ్లు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విత్తనాలను వెదజల్లే పద్ధతి వరి పంటను సులభంగా నాటుకోవచ్చని.. ఈ పద్ధతి పాటిస్తే… నారు పోసే పని, నాటు వేసే పని ఉండదని అలానే కూలీల కోసం ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం లేదని అన్నారు. నీటి వినియోగం కూడా 30- 35 శాతం తగ్గుతుందని, 10-15 రోజుల ముందు పంట చేతికి వస్తుందని రైతులకు వివరించారు. ఇక సాధారణ నాటు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలని, ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపు వడ్లు సరిపోతాయని అన్నారు.
సిద్దిపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మంత్రి హరీష్ ఆశాభావం వ్యక్తం చేసారు. వెదజల్లే పద్దతిలో వరి సాగు చేసే అంశంపై సిద్దిపేట జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కాగా వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై మంత్రి హరీష్ రావు గతేడాది నుంచి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో కూడా వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై మంత్రి రైతులకు అవగాహన కల్పించారు.