హరీష్ రావు…తెలంగాణ అధికార పార్టీలో ట్రబుల్ షూటర్. పార్టీ ఎక్కడ కష్టాల్లో ఉన్నా సరే హరీష్ రావు Harish Rao ముందుంటారు. పార్టీని సరిచేస్తారు. అలాగే ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం హరీష్ వేసే వ్యూహాల ముందు ప్రత్యర్ధులు చిత్తు కావాల్సిందే. ముఖ్యంగా ఉపఎన్నికల సమయంలో హరీష్ వ్యూహాలే టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతాయి.
కానీ మొన్న ఆ మధ్య జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో హరీష్ వ్యూహం వర్కౌట్ కాలేదు. ఊహించని విధంగా దుబ్బాక బరిలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాలుకు బలపం కట్టుకుని మరీ తిరిగిన సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోలేకపోవడంతో హరీష్ వ్యూహాలపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే హరీష్, దుబ్బాకలో పార్టీ గెలుపు కోసం గట్టిగానే కష్టపడ్డారు. కానీ బీజేపీ నుంచి బరిలో దిగిన రఘునంద వ్యక్తిగత ఇమేజ్, సానుభూతి వల్ల టీఆర్ఎస్‌కు ఓటమి తప్పలేదు.
అయితే ఈ సారి హుజూరాబాద్‌లో పకడ్బందీగా తన వ్యూహాలు అమలు చేయడానికి హరీష్ సిద్ధమయ్యారు. హుజూరాబాద్ బరిలో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి బాగానే కష్టపడుతున్నారు. కాకపోతే దుబ్బాక మాదిరిగా నియోజకవర్గంలోనే తిరగకుండా, హైదరాబాద్‌లోనే ఉంటూ కథ నడిపిస్తున్నారు. తాను అక్కడే ఉంటూ, మిగతా మంత్రులని, ఎమ్మెల్యేలని హుజూరాబాద్‌కు పంపించారు. ఇక ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ, నియోజకవర్గ పరిస్తితిని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే హుజూరాబాద్‌లో గెలుపు కోసం కీలకమైన నాయకులని పార్టీలోకి తీసుకుంటున్నారు. అయితే హుజూరాబాద్‌లో అడుగుపెట్టకుండానే హరీష్ ఈ తతంగమంతా నడిపిస్తున్నారు. మరి హరీష్ హుజూరాబాద్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనేది తెలియాల్సి ఉంది.
అలాగే దుబ్బాక సీన్ ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకుంటారో లేదో కూడా చూడాలి. ఈసారి హరీష్ వ్యూహం వర్కౌట్ అయ్యి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుస్తుందో లేక మళ్ళీ హరీష్‌కు ఎదురుదెబ్బ తగులుతుందో చూడాలి.