దుబ్బాక ఫలితం దెబ్బ హరీశ్ కి గట్టిగా తగలనుందా..!

-

తెలంగాణ పోరాటం,ఉద్యమాల సమయం నుంచి దుబ్బాక ని కంచుకోటగా మార్చుకున్న టీఆర్ఎస్ కి ఉప ఎన్నికల ఫలితం గట్టి షాక్ నిచ్చింది.దుబ్బాకను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతోన్న టీఆర్‌ఎస్ ఆధిపత్యానికి రఘునందన్ రావు గండి కొట్టారు. రామలింగారెడ్డి ఆకస్మిక మృతి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దుబ్బాక ప్రచారం మొత్తం మంత్రి హరీశ్ రావు చుట్టే తిరిగింది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉప ఎన్నికల్లో ఎన్నో ఘనవిజయాలందించిన హరీశ్ కి దుబ్బాక ఉప ఎన్నిక నల్లేరు మీద నడకే అనుకున్నారు..కానీ సీన్ రివర్సయింది.దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిరస్కరించి… కమలాన్ని నెత్తికెత్తుకున్నారు. ఈ ఓటమి ప్రభావం హరీశ్ పొలిటికల్ ఫ్యూచర్ పై గట్టిగానే పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దుబ్బాకలో పార్టీ అభ్యర్ధి సోలిపేట సుజాత అయినా హరీశ్ చుట్టునే దుబ్బాక టీఆర్ఎస్ రాజకీయం నడిచింది. స్వయంగా మంత్రి హరీశ్ రావే ప్రచారం సందర్భంగా నన్ను చూసి ఓటెయ్యండి…. నేను చూసుకుంటా అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ అధిష్ఠానం కూడా పూర్తి బాధ్యతలను హరీశ్ పైనే పెట్టింది. సీఎం కేసీఆర్ కాని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ దుబ్బాక వైపు తొంగిచూడలేదు. పూర్తి బాధ్యతలను హరీశ్ భుజ స్కంధాలపైనే మోపింది టీఆర్ఎస్. దుబ్బాకలో మాత్రం హరీశ్ ను కూడా కాదని… ఓటర్లు బీజేపీ వైపు మొగ్గారు.

ఇప్పటికే టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ నడుస్తుందని ఓ గ్రూపుకు కేటీఆర్ సారథ్యం వహిస్తుంటే… మరో గ్రూపుకు హరీశ్ సారథ్యం వహిస్తున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రచారమే ఉంది. చాలా రోజుల పాటు టీఆర్‌ఎస్ అధిష్ఠానం హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. తర్వాత ఎంతో కాలానికి కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత హరీశ్ రావు టీఆర్‌ఎస్ అధిష్ఠానంపై లోలోన రగిలిపోతున్నారని కూడా టీఆర్‌ఎస్‌లో ఓ వర్గం అభిప్రాయపడింది. ఇంత జరిగినా… హరీశ్ రావు ఎక్కడా అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయలేదు.

దుబ్బాకలో ఘన విజయం సాధించి తన ఉనికిని పార్టీలో మరోసారి చాటుదామనుకున్న హరీశ్‌కు దుబ్బాక ఫలితం పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇన్ని రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయంలో గానీ, పాలన విషయంలో కానీ సీఎం కేసీఆర్ పూర్తిగా హరీశ్ పైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. దుబ్బాకలో ఓటమి పాలైతే అది హరీశ్‌పైకి నెట్టేసి ఆయన రాజకీయ భవిత్యాన్ని దెబ్బతీయాలని కేటీఆర్ వర్గం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ముందునుంచి ఆరోపిస్తున్నాయి. నిజంగా ప్రతిపక్షాలు అన్నట్లు హరీశ్ రాజకీయ భవితవ్యం మసకబారుతుందా లేదా అన్నది భవిష్యత్ లో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version