ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలి : హరీశ్‌ రావు

-

నిమ్స్‌, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్ప‌త్రుల‌ పనితీరుపై మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీ నుంచి ఆన్‌లైన్‌లో నెలవారీ సమీక్ష నిర్వహించారు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలని, నివేదిక ఇవ్వాలని నిమ్స్‌ జెనిటిక్స్‌ విభాగం, మెటర్నల్‌ హెల్త్‌ జేడీని ఆదేశించారు హరీశ్‌రావు. బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారణ అయిన సందర్భాల్లో అవయవదానం చేసేలా కుటుంబ సభ్యులకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కౌన్సిలింగ్‌ ఇవ్వాలని సూచించారు.

అవసరమైతే తానే స్వయంగా మాట్లాడి ఒప్పించేందుకు సిద్ధమని ప్ర‌క‌టించారు హరీశ్‌రావు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని, అడిగినవన్నీ ఇస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఓపీ పెరుగుదలకు అనుగుణంగా కౌంటర్లు పెంచాలని సూచించారు. అవయవదానంపై అవగాహన పెంచాలని సూచించారు. బ్రెయిన్‌ డెడ్‌ డిక్లరేషన్‌, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల సంఖ్య పెరగాలని చెప్పారు హరీశ్‌రావు. నిమ్స్‌ అధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఉన్న డయాలసిస్‌ సెంటర్లను మానిటరింగ్‌ చేయాలని, ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో నూతనంగా నిర్మించిన 300 పడకల బ్లాక్‌ను మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని ప్ర‌క‌టించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు హరీశ్‌రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version