హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 50 లక్షల రూపాయల హవాలా డబ్బును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి పది గంటల సమయంలో హవాలా డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఖాజాగూడ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఓ ఇన్నోవా క్రిస్టా వాహనంలో తరలిస్తున్న హవాలా డబ్బును పట్టుకున్నారు. కర్ణాటకలోని కలబురిగికి తరలిస్తున్న విక్రమ్ నాగేశ్ అనే వ్యక్తిని ఖాజాగూడ డీపీఎస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని, నగదును ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. దాదాపు రూ.50 లక్షలకుపైగానే నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు. ఎస్ఓటీ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న అధికారులందరికీ అభినందలు తెలియజేశారు.