హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌పై హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేషనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో హెచ్‌సీఏలో నెలకొన్న వివాదంలో అజారుద్దీన్ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే అజారుద్దీన్ అపెక్స్ కౌన్సిల్‌లోని కొందరి తీరును తప్పుబట్టారు. ఈ వివాదంపై హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేషనారాయణ స్పందిస్తూ క్రికెట్ ఆడటం వేరని, అడ్మినిస్ట్రేషన్ వేరని అజారుద్దీన్ తెలుసుకోవాలన్నారు.హెచ్‌సీఏ పరువును అజారుద్దీన్ బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు.
అపెక్స్ కౌన్సిల్ తొలగించినా ప్రెసిడెంట్‌గా కొనసాగటం హాస్యాస్పదమని శేషనారాయణ ఎద్దేవా చేశారు. అజార్‌కు ప్రెసిడెంట్‌గా కొనసాగే లౌక్యం లేదని చెప్పారు. అందర్నీ కలుపుకునిపోయే తత్వం అజార్‌కు లేదని వ్యాఖ్యానించారు. జిల్లాల అధ్యక్షులను నియమించటంలో నియమాలు పాటించలేదని ఆరోపించారు. అజారుద్దీన్ హయాంలో 18 నెలల్లో బీసీసీఐ నుంచి రూ. 47కోట్లు వచ్చాయన్నారు. రూ.47 కోట్లు ఎక్కడ ఏమయ్యయో అజార్ చెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలో పరిణామాలపై బీసీసీఐ కలుగజేసుకునే పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. హెచ్ సీఏ సభ్యులను బీసీసీఐ డిసాల్వ్ చేస్తేనే హైదరాబాద్ క్రికెట్ బాగుపడుతుందని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడాననంటూ అజారుద్దీన్ అందర్నీ హేళన చేస్తున్నాడని శేష నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.