కలలకు ఎన్నో రూపాలు ఉంటాయి. ప్రతి కలకూ అర్థం వెతికేందుకు దారులు ఉంటాయి.మనిషి తన జీవితాన సాధించాల్సిన కలలకు రూపాలు ఆయన కృషిలో వెతుకులాటలో మాత్రమే నిజం అయి ఉంటాయి.రాజమౌళి అనే ఓ పెద్ద దర్శకుడి కలకు అతడు ప్రాణం జత చేశాడు. ఊహకు ఊపిరి ఇచ్చి కొత్త హంగులు అద్దాడు. ఆయన పేరు సాబు సిరిల్ ..ఆయన జీవితమే ప్రత్యేకం. ఓ గొప్ప విజయానికో సంకేతం.
కథ చెప్పాలి అని అనుకుంటే చాలు ఒక పెద్ద కాన్వాసు కళ్ల ముందరకు వస్తుంది.ఆ కాన్వాసు కొన్ని బొమ్మలు వస్తాయి.కొన్ని నగరాలు కొన్ని పల్లెలు కొన్ని రాజాస్థానాలు ఇంకా ఇంకొన్ని కళాకృతులు కళ్లెదుటకు వస్తాయి.ఆర్ట్ డైరెక్టర్ బొమ్మలు వేస్తూ ఉంటారు.. వేసే బొమ్మకు ప్రాణం కదలిక ఊహకు రంగు రూపం ఇచ్చిన చోట రాజమౌళి ఉంటారు. సాబు సిరిల్ అనే గొప్ప ప్రతిభావంతుడు అక్కడే ఉంటారు. ఇద్దరూ కలిసి బాహుబలి అనే పెద్ద ప్రపంచాన్ని సృష్టించారు.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం అదే ప్రయత్నం చేశారు.
జీవితం ఏదోఒకటి నేర్పుతుంది. మనం నేర్చుకోకుండానే వెళ్లిపోతాం. నెరవేర్చుకోకుండానే వెళ్లిపోతాం. అనుకున్నవి నెరవేర్చుకోవాలి అన్న ఊహ ఓ సినిమాకు ప్రాణం అయింది. ఓ చిన్న టీ ఎస్టేట్ గుమస్తా కొడుకు జాతీయ స్థాయిలో గర్వించదగ్గ గొప్ప కళా దర్శకులు అయ్యారు.ఇప్పుడు ఆయన మాట్లాడరు ఆయన కళ సంబంధిత ప్రక్రియ మాట్లాడుతుంది.ఆయనకు కళపై ప్రేమ కారణంగా సినిమాలు కొత్త రూపం తీసుకుంటున్నాయి.శంకర్, మణిరత్నం, రాజమౌళి లాంటి దర్శకులకు ఆయనొక ల్యాండ్ మార్క్ . ఆయన కళ ఒక సిగ్నేచర్ మార్క్.
జీవితం ఎన్నో ఇచ్చి ఎందరినో సొంతం చేసుకుని తీరాలని చెబుతుంది. తన జీవితం అందులో ఉన్న ప్రేమ, అందులో ఉన్న ఓటమి,అందులో ఉన్న గెలుపు ఇవన్నీ కూడా ఇవే నేర్పి ఉంటాయి. ఇప్పుడు మీకు నేను అందరికీ తెల్సినవాడిని కానీ ఒకప్పుడు ఏమీ కాదు కదా అన్న ఓ స్పృహ ఆయనలో ఉంటుంది. ముంబయి దారులు, చెన్నయ్ వీధులు, కేరళ తీరాలు ఆయననే కలవరిస్తున్నాయి. కళాత్మక సృష్టి ఒకటి మరో గొప్ప సృజనను కోరుకుంటుంది.
సాబు సిరిల్ నవ్వుకుంటూ ఆ సృజనకు తానొక ప్రతినిధి అవుతారు.అంతర్మథనం దాటి వెళ్లాక ఓ కళకు మంచి రూపం దక్కుతుంది. కానీ లోపలి ఘర్షణ ఇంకొంత ఉన్నతంగా కళను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతూనే ఉంటుంది.అటువంటి కళకు వందనాలు చెల్లించండి ఈ వారాంతాన..మరో విజువల్ వండర్ ఆయన కోసం మన కోసం ఎక్కడో సిద్ధం అయి ఉంటుంది. నిరీక్షించండి స్పప్న లోకాల ఆవిష్కరణకు సాబు సిరిల్ చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అయితే మేలు.