రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎగువన కురిసిన వర్షానికి కుప్పగంజి వాగు పొంగి 16 వ నెంబర్ జాతీయరహదారి పైకి నీరు చేరింది. చిలకలూరిపేటతో పాటు దగ్గరి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. నరసారావు పేట నుండి రొంపిచర్ల వెళ్ళే ప్రధాన మార్గంలో ఓగేరు వాగు పొంగి పొర్లుతోంది.
నెల్లూరు జిల్లాలో కూడా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు…రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. ఇక భారీ వర్షాల ప్రకాశం జిల్లాలోని మార్కాపురం రహదారిలో దొండ్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో కడప జిల్లా అతలాకుతులమవుతోంది. ప్రొద్దుటూరులో రోడ్లన్నీ నీటమునిగాయి. మోకాళ్ల లోతు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో కడపలోని బుగ్గ డ్యాంకు భారీగా వరద చేరుతోంది. కర్నూలు జిల్లాలో నిన్న అర్దరాత్రి నుంచి కురిసిన వర్షాలకు నంద్యాల,బండిఅత్మకూరు,మహానంది, గోస్పాడు మండలాల్లో నదులు,వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.