జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు భూగర్భగనులు, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు అందజేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పేలుళ్లు నిర్వహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు బుధవారం భూగర్భగనులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చింది.పేలుళ్లపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని హైకోర్టు పంపిన నోటీసుల్లో పేర్కొంది. కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ఈ మధ్యనే పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.