తెలుగు రాష్ట్రాల పొలిటికల్ లీడర్లలో హైకోర్టు టెన్షన్…!

-

తెలుగు రాష్ట్రాల రాజకీయనేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా కేసులు ఉన్న నేతలకైతే చెమటలు పడుతున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీల నాయ‌కుల‌పై న‌మోదైన అన్ని ర‌కాల కేసుల‌ను త్వరిత‌గ‌తిన విచారించేందుకు న్యాయస్ధానాలు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు హైకోర్టు జిల్లా కోర్టుల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజ‌కీయ నేతల‌పై న‌మోదైన‌ క్రిమినల్‌ కేసులతో పాటు ఇతర కేసులను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు సిద్ధమైంది. అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం, ఎక్సైజ్‌ చట్టం, కస్టమ్స్‌ చట్టం, జీఎస్టీ చట్టం, కంపెనీల చట్టం వంటి ప్రత్యేక చట్టాలకు సంబంధించి కూడా ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల గురించి విచారించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సిట్టింగ్‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 223 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితా కూడా చేర్చితే సంఖ్య మరింత పెరుగుతుందని న్యాయ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక సహా చాలా రాష్ట్రాల్లో పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు కేసులు ఎదుర్కొంటుండగా ఈ రాష్ట్రాల్లో కేవలం ఒక్కొక్కటి చొప్పునే ప్రత్యేక కోర్టులు ఉన్నాయని అమికస్‌ క్యూరీ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేత‌లు ప్రస్తుతం కొంద‌రు ప్ర‌భుత్వంలో ఉన్న‌త ప‌దవుల్లో ఉన్నారు. మ‌రికొంద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులుగా కొన‌సాగుతున్నారు. అయితే అధికార పార్టీ నేత‌లు త‌మ‌పై ఉన్న కేసుల విష‌యంలో న్యాయ‌స్థానాల‌కు వెళ్లాల్సి వ‌స్తుందేమోన‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంద‌రు నేతలు మాత్రం తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా త‌మ‌పై అక్ర‌మ కేసులు పెట్టార‌ని… విచార‌ణ‌లో తాము ఎలాంటి త‌ప్పుచేయలేద‌ని రుజువు అవుతుంద‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version