రాజకీయాలు అంటేనే.. ఎంతో కోపం ఉన్నా.. అంతా నవ్వుతూనే ఉండాలి. ఎన్నో బాధలు ఉన్నా.. అన్నిం టినీ దిగమింగుకుని ముందుకు సాగాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. అన్నింటినీ సర్దుకు పోతూ.. అందరి నీ కలుపుకొని పోవాలి. అయితే, ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, కీలక నాయకుడు.. జగన్‌కు అత్యంత ప్రియమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి.. వివాదాస్పద మవుతున్నారు. అత్తమీద కోసం ఎవరిమీదో చూపించిన చందంగా తనకు మంత్రి వర్గంలో సీటురాలేదనే అక్కసును ఆయన పార్టీ సీనియర్లపై చూపిస్తున్నారని అంటున్నారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని పోవాల్సిన కాకాణి.. స్థానిక ఎంపీతోను, ఎమ్మెల్యేతోను, మంత్రి తోనూ విభేదాలు సృష్టించుకుని రగడకు కారణంగా, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అధికార పక్షంలో ఉన్న నాయకులు ప్రతిపక్షంతో విభేదాలు ఉంటే చూసేవారికి, వినేవారికి కూడా పోనీలే రాజకీయాలు.. అని సరిపెట్టుకుంటారు. కానీ, ఒకే పార్టీలో ఉంటూ.. సొంత పార్టీ నేతలతోనే విబేదాలు పెట్టుకోవడంపై విమర్శకులు సైతం నోరెళ్ల బెడుతున్నారు.
నెల్లూరు ఎంపీ.., నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలు, మంత్రి అనిల్‌తో కూడా కాకాణి విభేదాలు పెట్టుకున్నారని అంటున్నారు. మంత్రి పదవిని ఆశించిన కాకాణికి.. అనూహ్యంగా ఆ పదవి దక్కలేదు. నిజానికి వైసీపీలో సీనియరే. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డిని చిత్తుగా ఓడిస్తున్న నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తనకు పార్టీలో గుర్తింపు కోరుకోవడం సహజం. అయితే, మంత్రి వర్గంలో లెక్కకు మించిన నాయకుల సంఖ్య ఉండడంతో జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు.
అయితే, రెండున్నరేళ్ల తర్వాత పరిస్థితి అనుకూలంగా మారే పరిస్థితి ఉంది. అయితే, ఈ విషయాన్ని గుర్తించలేక పోతున్న కాకాణి.. తనకు మంత్రి పదవి దక్కలేదనే అక్కసుతో తోటి నేతలపై విరుచుకుపడుతుండడం, లోపాయికారీగా సహకరించకపోగా.. ప్రతిపక్ష నాయకులకు మద్దతిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ నేతతో జగన్‌కు తిప్పలు తప్పవంటున్నారు. మరి ఇలా వ్యవహరించి మొత్తానికే మోసం కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు.