హోటల్స్, రెస్టారెంట్ల వద్ద పార్కింగ్ చేసిన మీ వాహనాలు పోగొట్టుకున్నారా..? అలాంటి సందర్భాల్లో ఆ హోటల్ లేదా రెస్టారెంటే మీకు పోయిన మీ వాహన ఖరీదును కచ్చితంగా లెక్క కట్టి మరీ ఇవ్వాల్సిందే. అలా అని సుప్రీం కోర్టే తీర్పునిచ్చింది.
హోటల్స్, రెస్టారెంట్ల వద్ద పార్కింగ్ చేసిన మీ వాహనాలు పోగొట్టుకున్నారా..? సదరు హోటల్ లేదా రెస్టారెంట్ యాజమాన్యాలు నష్ట పరిహారం చెల్లించేది లేదని ఖరాఖండిగా చెప్పేశాయా..? అయితే చింతించకండి. అలాంటి సందర్భాల్లో ఆ హోటల్ లేదా రెస్టారెంటే మీకు పోయిన మీ వాహన ఖరీదును కచ్చితంగా లెక్క కట్టి మరీ ఇవ్వాల్సిందే. అలా అని మేం చెప్పడం లేదు.. సుప్రీం కోర్టే అలా తీర్పునిచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 1998లో అక్కడి తాజ్ మహల్ హోటల్‌లో ఉన్న రెస్టారెంట్‌కు తన మారుతీ జెన్ కారులో వెళ్లాడు. హోటల్ పార్కింగ్‌లో వాలెట్ పార్కింగ్‌కు తన కారును అప్పజెప్పి రెస్టారెంట్‌కు వెళ్లాడు. అనంతరం వచ్చి చూసే సరికి కారు లేదు. దీంతో హోటల్ యాజమాన్యం కారు దొంగతనానికి బాధ్యత వహించాలని, తనకు కారు నష్ట పరిహారం చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశాడు. అయితే హోటల్ వారు అందుకు నిరాకరించారు. కస్టమర్లు వారి వాహనాలను హోటల్‌లో పార్క్ చేసినా.. బాధ్యత వారిదేనని, వాటి పట్ల తాము ఎలాంటి బాధ్యతా తీసుకోమని, కనుక నష్టపరిహారం చెల్లించేది లేదని స్పష్టం చేశారు.
అయితే ఆ వ్యక్తి ఈ విషయంపై సుప్రీం కోర్టులోని వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా కేసులో వాదనలు జరిగి చివరకు తాజాగా కోర్టు తీర్పు చెప్పింది. హోటల్‌లో కస్టమర్లు వాహనాలను పార్క్ చేస్తే కచ్చితంగా ఆ వాహనాలకు హోటల్ వారే బాధ్యత వహించాలని, ఆ వాహనాలు దొంగతనానికి గురైతే అందుకు బాధ్యత వహించి కస్టమర్లకు వాహనం ఖరీదును నష్ట పరిహారంగా ఇవ్వాల్సిందేనని కోర్టు న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. ఈ క్రమంలో సదరు హోటల్ ఆ వ్యక్తికి రూ.2.80 లక్షలను నష్ట పరిహారంగా చెల్లించింది. అయితే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లేదా కస్టమర్ నిర్లక్ష్యం వల్ల, ట్రాఫిక్ పోలీసులు ఏదైనా కారణంతో వాహనాన్ని సీజ్ చేసిన సందర్భంలో కారు డ్యామేజ్ అయినా, దొంగతనం జరిగినా హోటల్ యాజమాన్యాలు ఆ వాహనాల పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, అప్పుడు కస్టమర్‌దే బాధ్యత అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.