తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 17,081 బెడ్లు కోవిడ్ పేషెంట్ల కోసం ఉండగా.. అందులో ప్రస్తుతం 15,367 బెడ్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడైంది. కేవలం 10 శాతం బెడ్లలో మాత్రమే పేషెంట్లు ఉన్నారు. మొత్తం 11,085 ఐసొలేషన్ బెడ్లు, 2,926 ఆక్సిజన్ బెడ్లు, 1,356 ఐసీయూ బెడ్లు కోవిడ్ పేషెంట్లకు అందుబాటులో ఉన్నాయి.
గాంధీ హాస్పిటల్‌లో 1,890 బెడ్లు ఉండగా.. వాటిలో 1092 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం హాస్పిటళ్లలో 1714 బెడ్లలో పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. చాలా మంది పేషెంట్లు ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వారికి మెడిసిన్లతోపాటు విటమిన్ సి, బి-కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు, మాస్కులు, శానిటైజర్, హ్యాండ్ వాష్, గ్లోవ్‌లు, ఇతర అత్యవసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం కిట్ రూపంలో అందజేస్తోంది.
ఆదివారం మొత్తం 1563 మంది డిశ్చార్జి అయినట్లు బులెటిన్‌లో తెలిపారు. దీని వల్ల ప్రభుత్వ హాస్పిటళ్లలో కోవిడ్ పేషెంట్లకు పలు బెడ్లు ఖాళీగా అందుబాటులో ఉన్నాయి. కాగా గచ్చిబౌలిలోని టిమ్స్ అందుబాటులోకి వస్తే మరో 1200 బెడ్లు పేషెంట్లకు లభిస్తాయి. అయితే కేవలం ఒక మోస్తరు, స్వల్ప లక్షణాలు ఉన్నవారితోపాటు లక్షణాలు లేనివారినే హోం ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేవలం ఎమర్జెన్సీ పేషెంట్లకు మాత్రమే హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. ఇక క్వారంటైన్ అవసరం అని విజ్ఞప్తి చేస్తున్నవారికి నేచర్ క్యూర్ హాస్పిటల్, నిజామియా దవాఖానా, ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు.
కాగా ప్రభుత్వ హాస్పిటళ్లలో కోవిడ్ బెడ్లు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఖాళీగా ఎన్ని ఉన్నాయి.. అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని హైకోర్టు ఆదేశించడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలను తెలియజేసింది.