పోస్టాఫీసుల్లో మనం అనేక రకాలుగా డబ్బును పొదుపు చేసుకోవచ్చన్న సంగతి తెలిసిందే. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర.. ఇలా రక రకాలుగా పోస్టాఫీసుల్లో డబ్బును పొదుపు చేయవచ్చు. ఆయా పథకాల్లో డబ్బును పొదుపు చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటు కూడా ఇస్తారు. ఇక ఇవే కాకుండా పోస్టాఫీసుల్లో ప్రస్తుతం ఎవరైనా సరే సేవింగ్స్ అకౌంట్‌ను తెరిచి కూడా డబ్బులు పొదుపు చేయవచ్చు. దానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ సౌకర్యాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం పొందాలంటే వారు ఖాతా కలిగిన ఉన్న పోస్టాఫీస్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని యాక్టివేషన్ చేసుకునేందుకు అప్లికేషన్ ఫాం ఇస్తారు. దాన్ని నింపాలి. అనంతరం పాన్, ఆధార్ తదితర ధ్రువ పత్రాలతో సదరు ఫాం ఇస్తే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం యాక్టివేట్ అవుతుంది. అయితే అకౌంట్‌లో మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం యాక్టివేట్ అయినట్లు మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
తరువాత https://ebanking.indiapost.gov.in అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో న్యూ యూజర్ యాక్టివేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం కస్టమర్ ఐడీని ఎంటర్ చేయాలి. అది పాస్‌బుక్ పై ప్రింట్ అయి ఉంటుంది. దాన్నే సీఐఎఫ్ ఐడీ అని కూడా అంటారు. తరువాత అక్కడ సూచించినట్లుగా స్టెప్స్ పాటిస్తూ లాగిన్ పాస్‌వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవాలి. దీంతో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అనంతరం పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకుంటే పీపీఎఫ్ లేదా ఆర్‌డీ మొత్తాలను జమ చేయాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఆ పనులను పూర్తి చేయవచ్చు.