ఫిస్టులా అనేది చాలా మంది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే సమస్య. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే నొప్పి మరింత తీవ్రమవుతుంది. శరీరంలోని రెండు అవయవాల మధ్య లేదా అంతర్గత అవయవానికి, చర్మానికి మధ్య ఏర్పడే అసాధారణ మార్గాన్నే ఫిస్టులా అంటారు. ముఖ్యంగా మలద్వారం వద్ద వచ్చే ‘యానల్ ఫిస్టులా’ అధికంగా కనిపిస్తుంది. సరైన సమయంలో లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే, ఈ బాధాకరమైన సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. ఆ ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం..
మలద్వారం చుట్టూ ఉండే గ్రంథులలో ఇన్ఫెక్షన్ ఏర్పడి, చీము గడ్డ (Abscess) తయారైనప్పుడు అది సరిగ్గా తగ్గకపోతే ఫిస్టులాగా మారుతుంది. దీని ప్రధాన లక్షణం మలద్వారం వద్ద నిరంతరం నొప్పి మరియు వాపు ఉండటం. మలవిసర్జన సమయంలో విపరీతమైన మంట, నొప్పి కలగడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో ఒక చిన్న రంధ్రంలా ఏర్పడి, దాని నుండి చీము లేదా రక్తం స్రవిస్తుంటుంది. ఈ స్రావాల వల్ల దురద మరియు చర్మం ఎర్రగా మారడం,కూర్చోలేకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
కేవలం నొప్పే కాకుండా, శరీరంలో ఇతర మార్పుల ద్వారా కూడా ఫిస్టులాను గుర్తించవచ్చు. ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు తరచూ జ్వరం రావడం, చలిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మలద్వారం చుట్టూ ఏదైనా గట్టిగా తగిలినా లేదా అక్కడి నుండి దుర్వాసనతో కూడిన ద్రవాలు వస్తున్నా అది ఫిస్టులా అయ్యే అవకాశం ఉంది.

చాలా మంది దీనిని పైల్స్ (మొలలు) అని పొరపడుతుంటారు, కానీ ఫిస్టులాలో చీము కారుతూ వుంటుంది. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
ఫిస్టులా అనేది దానంతట అదే తగ్గే సమస్య కాదు. దీనిని ఇంటి చిట్కాలతో నయం చేయాలని ప్రయత్నించి కాలాన్ని వృధా చేయకూడదు. లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన డాక్టరును సంప్రదించి అవసరమైన స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఆధునిక వైద్యంలో లేజర్ ట్రీట్‌మెంట్ వంటి సులభమైన పద్ధతుల ద్వారా తక్కువ కాలంలోనే దీని నుండి కోలుకోవచ్చు.
