కృష్ణాష్టమినాడు ఇలా పూజలు చేస్తే సకల శుభాలు !!

-

శ్రీకృష్ణాష్టమి. అత్యంత పర్వదినం. ఈరోజు చిన్నికృష్ణయ్యను భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పలు పురాణాలు పేర్కొన్నాయి. ఆగస్టు 11న శ్రీకృష్ణాష్టమి. ఈరోజు స్వామిని ఎలా ఆరాధించాలి? ఏయే శ్లోకాలు చదువాలి అనే విషయాలును తెలుసుకుందాం…

కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చు కుని, తలస్నానం చేసి, పసుపురంగు బట్టలు వేసుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకుని అవుపేడతో అలికి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలు చిత్రించుకోవాలి.

కృష్ణాష్టమి వేళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజ చేయడం మంచిది. పూజా స్థలంలో బియ్యం రాశిగా పోసి కొత్త వస్త్రాన్ని దానిపై వేసి మంటపం ఏర్పాటు చేసుకుని కొత్త కుండను గంధం, పువ్వులు, అక్షతలతో అలంకరించి మంటపంపై పెట్టుకోవాలి. ఆ కుండకు వస్త్రం చుట్టి దానిపై బాలకృష్ణుని ప్రతిమను పెట్టుకోవాలి. ఈ సమయంలో కంచు దీపంలో కొబ్బరినూనె పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. నుదుటిన బొట్టు పెట్టుకుని, తూర్పు వైపునకు తిరిగి “ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః’’ అనే మంత్రాన్ని 108సార్లు జపించాలి.

పఠించాల్సిన శ్లోకాలు

ఈరోజు ముఖ్యంగా స్వామికి సంబంధించిన అష్టోతరం, బాలకృష్ణా స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, శ్రీ శ్రీమద్భాగవతంలోని దశమస్కందం చదవాలి. తరువాత శ్రీకృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ నివేదించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి శ్రీకృష్ణుడి లీలలు, కథలతో జాగరణ చేసి మరుసటి రోజున భోజనం చేయాలి. కృష్ణాష్టమి రోజున ఆలయాలలో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించినవారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని పండితులు, పురోహితులు తెలియజేస్తున్నారు.

స్కాందపురాణం ప్రకారం కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతాయి. కృష్ణాష్టమి రోజున బంగారంతో కాని, వెండితో కాని చంద్రబింబాన్ని పూజించి అర్ఘ్యం యిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. అలాగే ఈ రోజున భీష్మాచార్యులను అర్చించి పూజిస్తే సకల పాపాలు పోతాయని పండితులు పేర్కొంటున్నారు.

స్వామిని ఆరాధించేటప్పుడు మనసు ఆయన మీద పెట్టి శ్రద్ధతో ఆయన నామ కీర్తన, స్మరణ చేయాలి. ఉపవాసం ఉండటం అనేది ఆరోగ్య పరిస్థితులను బట్టి చేయాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులు ఉపవాసం ఉండకూడదు.

– శ్రీ

అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.. ఈ రోజుల్లో రామాయణ, మహాభారతాలు ఎంతమందికి తెలుసు.. శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు తెలిసిన వారెందరు.. అందరికీ తెలియజేయాలనే తపనతో manalokam.com మనలోకం.కామ్‌ చేస్తు ప్రయత్నమే ఇది. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ మహత్యం తెలియజేసే కథనాలు తప్పకుండా చదవండి.. అలాగే మీ మిత్రులతో పంచుకోండి.. >> https://bit.ly/2EXNuz9

Read more RELATED
Recommended to you

Exit mobile version