చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో కేవలం మేడిన్ ఇండియా వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ది కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) కూడా ఇదే విషయమై గతంలో సూచనలు చేసింది. అయితే భారతీయులు ఆ విషయాలను తూచా తప్పకుండా పాటించారు. దీంతో దీపావళి సందర్భంగా దేశీయ కంపెనీలు, వ్యాపారులకు భారీ లాభాలు వస్తే.. అటు చైనా వాళ్లకు భారీగా నష్టాలు వచ్చాయి.
దీపావళి సందర్భంగా దేశంలోని ప్రజలు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, కిచెన్ వస్తువులు, గిఫ్ట్‌లు, స్వీట్లు, ఫర్నిచర్, వంట సామగ్రి, బంగారం, ఫుట్‌వేర్, వాచ్‌లు, దుస్తులు తదితర ఉత్పత్తులను ఎక్కువగా కొన్నారని కెయిట్ వెల్లడించింది. అయితే భారత ప్రజలు చాలా వరకు దేశీయ ఉత్పత్తులనే కొన్నారని, దీని వల్ల దేశంలోని కంపెనీలు, వ్యాపారులకు దీపావళి సందర్భంగా రూ.72వేల కోట్ల టర్నోవర్ లభించిందని కెయిట్ తెలిపింది. అలాగే ఈ ప్రభావం వల్ల చైనాకు రూ.40వేల కోట్ల నష్టం వచ్చిందని కెయిట్ తెలిపింది. ఈ క్రమంలో భారత ప్రజలు దీపావళి సందర్భంగా చైనాకు పెద్ద షాకిచ్చారని కెయిట్ స్పష్టం చేసింది.
కాగా కెయిట్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో గత కొద్ది నెలలుగా జనాలు కేవలం అత్యవసరం అయిన వస్తువులనే కొన్నారని, అందువల్ల వారి వద్ద కొంత డబ్బు పొదుపు అయిందని, అందుకనే జనాలు దీపావళికి భారీగా షాపింగ్ చేశారని తెలిపారు. కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, నాగ్‌పూర్, రాయ్‌పూర్, భువనేశ్వర్, రాంచీ, భోపాల్, లక్నో తదితర 20 నగరాల్లో నిర్వహించిన సర్వే ద్వారా కెయిట్ ఈ వివరాలను వెల్లడించింది.