“జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమానికి అనూహ్య స్పందన..

-

 

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపుగా సంవత్సరం సమయం ఉన్నా… ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకున్న టీడీపీ ఫుల్‌ జోష్‌ మీద ఉంది. చంద్రబాబు దూకుడు మీదున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ జగనన్నే మా భవిష్యత్‌ అనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై లబ్దిదారుల అభిప్రాయలు తెలుసుకునేందుకు ఇంటింటికి సర్వే చేస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 15000 వేల సచివాలయాల పరిధిలో సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను కలుస్తున్నారు. మూడో రోజు ముగిసేసరికి మొత్తం 28 లక్షల గృహాలను సందర్శించారు.

ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం 14 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా కోటి అరవై లక్షల కుటుంబాలకు చెందిన సుమారు ఐదు కోట్ల మందిని కలుసుకుంటారు. ఎప్పటిలాగే టీడీపీ, జనసేన ఈ కార్యక్రమాన్ని ఎగతాళి చేశాయి. అయితే ఎవరూ ఊహించనివిధంగా జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమానికి లబ్దిదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని లబ్దిదారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఇంటింటికి వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర ప్రజాప్రతినిధులు, గృహసారథులు, వలంటీర్లను ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కొన్ని ఊళ్లలో ప్రజాప్రతినిధులను ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు ప్రజలు.

జగనన్నే మా భవిష్యత్‌ అని ముద్రించిన స్టిక్కర్లను తమ ఇంటి గోడలకు, తలుపులకు, మొబైల్‌ ఫోన్లకు ఎంతో ఇష్టంతో అతికించుకుంటున్నారు. ముఖ్యంగా నెలనెలా పెన్షన్‌ తీసుకుంటున్న వృద్ధులు, మహిళలు జగనన్నే మా భవిష్యత్‌ స్టిక్కర్లను చూసి ఎంతో మురిసిపోతున్నారు. కొంతమంది జగన్‌ మీద తమకున్న అభిమానాన్ని, ప్రేమను చాటుకోవడానికి ఇంటి బయట గోడలకు కాకుండా ఇంట్లో దేవుడి ఫోటోల పక్కనే ఆ స్టిక్కర్లను అతికిస్తున్నారు. అంతేకాదు…8296082960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తున్నారు. ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ ద్వారా సీఎం జగన్‌ మాట్లాడిన సందేశం వినిపిస్తుంది. ఈ విధంగా మూడు రోజుల్లోనే 20 లక్షల మిస్‌డ్‌ కాల్స్‌ వచ్చాయంటేనే ఈ కార్యక్రమం ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు వైసీపీ నాయకులు.

ఇంటింటికి వైసీపీ నాయకులు, గృహసారథులు, వాలంటీర్లు, ఇతర నాయకులు వెళ్తుండడంతో రాష్ట్రమంతటా సందడి వాతావరణం కనిపిస్తోంది. నాలుగేళ్లుగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దాదాపు 90 శాతం ప్రజలకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలాగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి లబ్దిదారుల నుంచి విశేషమైన స్పందన వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంతవరకు వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమాల్లో జగనన్నే మా భవిష్యత్‌ కు వచ్చినంత రెస్పాన్స్‌ మరే ప్రోగ్రామ్‌కు రాలేదు అని అంటున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇది చూసి చంద్రబాబు రైళ్లు పరిగెడుతున్నాయి.

జగన్‌ పని అయిపోయిందని చంద్రబాబు ఈమధ్య జోరుగా ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు ప్రజలు జగనన్నే మా భవిష్యత్‌ అంటూ స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం ఆయనకు దడ పుట్టిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి మద్దతు కోరాలనే ఆశయంతో ఐప్యాక్‌ బృందం రూపకల్పన చేసిన జగనన్నే మా భవిష్యత్‌ అనే ఈ వినూత్న కార్యక్రమం ఊహించినదానికంటే ఎక్కువగా విజయవంతం కావడంతో వైసీపీ నేతలు కార్యకర్తల్లో జోష్‌ పెంచింది. ప్రజలతో మమేకం కావడం కోసం ఐప్యాక్‌ టీమ్‌ తీర్చిదిద్దిన జగనన్నే మా భవిష్యత్‌ అనే ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version