అటల్‌ టనల్‌లో చిక్కుకున్న వందలాది మంది పర్యాటకులు..

-

ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంటది మంచు.. అబ్బో..చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.. మనాలి ఈ టైమ్‌లో వెళ్తే మస్త్‌ ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్‌ ఏంటంటే.. మీరు అసలు ఈ టైమ్‌లో వెళ్తే రూంలోంచి కూడా బయటకురాలేరు. అంత చలి ..ఇంకా మంచు ఉంటుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ వద్ద అటల్‌ సొరంగ మార్గం గురించి తెలిసే ఉంటుంది. రోహతంగ్‌ నుంచి వచ్చేప్పుడు అందరూ ఈ మార్గం గుండానే వస్తారు.. ఇప్పుడా మార్గంలో వందలాది మంది పర్యాటకులు చిక్కుకున్నారు. .

హిమాచల్‌ప్రదేశ్‌లో వ్యూహాత్మకంగా నిర్మించిన అటల్‌ సొరంగ మార్గంలో దాదాపు 400 వందల వాహనాల్లోని పర్యాటకులు చిక్కుకున్నారు. రోహ్‌తంగ్‌ ప్రాంతంలోని మంచు విపరీతంగా కురుస్తుండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సొరంగం దక్షిణ భాగం వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సమాచారం అందుకున్న కీలాంగ్‌, మనాలీ నుంచి పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కొందరు పర్యాటకులు మాత్రం మంచును బాగా ఆస్వాదించినట్లు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడం వల్లే వాహనాలు అటల్‌ సొరంగ మార్గంలో చిక్కుకున్నాయని లాహుల్‌, స్పితి డిప్యూటీ కమిషనర్‌ సుమిత్‌ ఖిమ్‌తా వెల్లడించారు.

స్థానికుల సాయంతో వారికి భోజన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పర్యాటకులు జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలని కులు డిప్యూటీ కమిషనర్‌ అషుతోష్‌ గార్గ్‌ వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు వేల మంది పర్యాటకులు ఈ టైమ్‌లో మనాలి వస్తుంటారు. వందల వాహనాలు రాకపోకలు సాగించడం, మరోవైపు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఇక్కడ తరచూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. సిమ్లా, చంబా, కిన్నౌర్‌, లాహౌల్‌, స్పితి తదితర మార్గాల్లోనూ ట్రాఫిక్‌ జామ్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ వసతి సదుపాయాలు లేవు. దీంతో చాలా మంది పర్యాటకులు హోటల్స్‌లో కాకుండా వివిధ చోట్ల బస చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చంబా జిల్లాలోని డల్హౌసీ, సలోనీ, చురాగ్‌ ప్రాంతాల్లో మంచు ప్రమాదకర స్థాయిలో కురుస్తోంది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొథి జిల్లాలో 15 సెంటీమీటర్లు, కల్పా, ఉదయ్‌పూర్‌ జిల్లాల్లో 5 సెంటీమీటర్లు, పోహ్‌, సంగ్లా జిల్లాల్లో 4 సెంటీమీటర్లు, గోండా, షిల్లారో జిల్లాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున మంచుకురిసినట్లు అక్కడి వాతావరణ విభాగం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version