కారు గుర్తు అంటే ఈటల…ఈటల అంటే కారు గుర్తు…ఇది గత ఆరు పర్యాయాలు హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగిన తంతు. ఇక్కడ కారు గుర్తుకు ఓటు వేస్తేనే ఈటల రాజేందర్ గెలిచినట్లు. గత ఆరు సార్లు ఈటల అదే కారు గుర్తుపై విజయం సాధించారు. అయితే ఇలా అన్నిసార్లు కారు గుర్తు మీద పోటీ చేసిన ఈటల, ఇప్పుడు గుర్తు మార్చడం కాస్త ఇబ్బంది అయ్యేలా కనిపిస్తోంది.
ఎందుకంటే హుజూరాబాద్‌లో మెజారిటీ ప్రజలు కారు గుర్తుకు అలవాటు పడిపోయారు. పైగా ఇప్పుడు ఈటల పోటీ చేసిన బీజేపీ గుర్తు అయిన కమలానికి ఎక్కువ ఓట్లు పడిన సందర్భాలు లేవు. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ కమలం గుర్తుకు కేవలం 1800 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే ఇక్కడ బీజేపీ బలం ఏంటో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈటల తన సొంత బలాన్ని నమ్ముకుని మరీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజూరాబాద్ బరిలో నిలబడ్డారు.
మరి ఇలా బీజేపీ పార్టీ తరుపున నిలబడుతున్న ఈటలకు, కారు గుర్తు ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈటల కారు గుర్తుతోనే గెలిచారు. ప్రజలకు కూడా అదే బాగా అలవాటు అయింది. పైగా గ్రామాల్లో చదువుకోని వారు చాలామంది ఉంటారు. వారు ఈటల అంటే కారు అని బండ గుర్తు పెట్టేసుకుంటారు. అలాంటివారిని మార్చాల్సిన బాధ్యత ఈటలదే. హుజూరాబాద్ లో ఈటలకు మంచి బలం ఉంది గానీ, కమలం గుర్తుకు బలం లేదు. కాబట్టి కమలం గుర్తుని కూడా విపరీతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయకపోతే ఈటలకే ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి కారు గుర్తుకు చెక్ పెట్టి కమలం గుర్తుని ఈటల హైలైట్ చేయాలి.