తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోన్న ఈ ఉప ఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పలువురి పేర్లు పరిశీలించి చివరకు కోట రామారావు పేరు ఖరారు చేశారు.
ఇక ప్రచారపర్వంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇప్పటికే దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికే భూస్థాపితం అయిన టీడీపీ గత ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమను బలపరచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కోరారు.
ఇప్పటికి అయితే టీడీపీ తమ మద్దతు కాంగ్రెస్‌కు ఇస్తున్నట్టు ప్రకటించలేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. అలాగే టీడీపీకి ఎప్పుడూ సపోర్ట్ చేసే కమ్మ సామాజికవర్గం ఓటర్లు కూడా ఇక్కడ బలంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీడీపీ సపోర్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ పోటీ చేసి తమ బలం ఎంతో ? తెలుసుకోవాలని టీ టీడీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పోటీ చేస్తే పార్టీ కేడర్ మళ్లీ ఏకతాటిమీదకు వస్తారన్నదే టీడీపీ నేతల ప్లాన్.
ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. హుజూర్ నగర్ లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలని పలువురు నేతలు ఆయనకు సూచించారు. హుజూర్ నగర్ లో అభ్యర్థిని పోటీకి దింపే విషయంపై శనివారం నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. హుజూర్ నగర్ టీడీపి అభ్యర్థులుగా నన్నూరి నర్సిరెడ్డి, చావా కిరణ్మయి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో నర్సిరెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. చావా కిరణ్మయి గతంలో హుజూర్‌నగర్ ఎంపీపీగా పనిచేశారు.