ఖైరాతాబాద్ మహాగణపతి నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు. మొత్తం 400 మంది పోలీసులు మూడు షిఫ్టుల్లో బందోబస్తు నిర్వహించనున్నారని వివరించారు. భక్తులు, పోలీసులు సహకరించాలని ఏసీపీ కోరారు. స్వామి వారి దర్శనానికి ప్రత్యేకంగా 3 లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, రేపు వినాయక చవితి సందర్భంగా ఉదయం ఖైరాతాబాద్ మహా గణపతి పూజలు అందుకోనున్నారు.అనంతరం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఖైరాతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.దీనికి తోడు పోలీసులు కూడా ప్రత్యేకంగా భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున గణపతి మండప సమీపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను నిత్యం పర్యవేక్షించనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.