నిన్నటి ఎన్నికల్లో ఈనాడు సీనియర్ స్టాఫర్ వేణు గోపాల్ నాయుడు అధ్యక్షులుగా గెలిచారు.ఇంకా ఇంకొందరు కూడా కొత్త కార్యవర్గంలో ఇదే ఎన్నికల రూపంలో చోటు దక్కించుకున్నారు.ఇప్పటిదాకా జరిగిన వాటిపై ఎవ్వరూ మాట్లాడకుండా ఇకపై ఏం జరుగుతుందో కూడా ఎవ్వరూ పైకి చెప్పకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఓ విడ్డూరం.
వాస్తవానికి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో అడుగు పెట్టడానికి ప్రజా సంఘాలు కూడా భయపడుతున్న దాఖలాలు ఉన్నాయి. అక్కడ ఏ మీటింగ్ పెట్టాలన్నా అదంతా లక్షల్లో వ్యవహారం. అక్కడున్న జర్నలిస్టు జలగలను ఏ ఒక్కరూ నిలువరించలేరు.వాళ్లు పైసలు ఉన్న కవర్ ఇవ్వనిదే పచ్చనోట్ల తళుకుబెళుకులు చూడనిదే అస్సలు కాలు కదపనివ్వరు. ఇటువంటి ఓ అనైతిక వాతావరణం ఉన్నచోట ప్రెస్ క్లబ్ లో అంతా మంచే జరిగి తీరుతుంది అని ఎలా అనుకుంటారు?
కొత్త అధ్యక్షుడిగా వచ్చిన వారు అయినా వీటిని పరిష్కరిస్తారని ఆశించడం తప్పే అవుతుంది.ఎందుకంటే గత కొద్దికాలంగా అక్కడ తిష్ట వేసిన సమస్యలు పరిష్కరించడం,సంస్కరణాయుత ఆలోచనలకు ఆధారం అయ్యే విధంగా ప్రెస్ క్లబ్ ను నడపడం అన్నవి మాటలు చెప్పినంత సులువేం కాదు. ప్యానెల్ లో ఎవ్వరున్నా ఇవాళ అక్కడ జరిగే చీకటిని తొలగించలేరు. ఆ దిశగా గతంలో పనిచేసిన అధ్యక్షులు ఎవ్వరూ కృషి చేయలేదు. అంటే దీన్నొక రాజకీయ పదవిగా భావించి పొలిటికల్ లాబీయింగ్ కు చాలా మంది వాడుకున్నారా అంటే ఔననే సమాధానం చెప్పక తప్పదు.