కరోనా సమయంలో ఓవైపు హాస్పిటళ్లలో బెడ్లు దొరక్క జనాలు సతమతం అవుతుంటే.. మరోవైపు హైదరాబాద్ నగరంలో ప్రైవేటు హాస్పిటళ్లు మాత్రం అనైతికంగా ప్రవర్తిస్తున్నాయి. రోజుకు రూ.1.50 లక్షలు ఇస్తే బెడ్లను అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నాయి. పలువురు వీఐపీలు, సెలబ్రిటీలు ఆ మొత్తం చెల్లించి ముందే బెడ్లను రిజర్వ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస రావు ఇదే విషయంపై మాట్లాడుతూ.. కొందరు వీఐపీలు రూ.లక్షల్లో డబ్బు అడ్వాన్స్ చెల్లించి ముందుగానే హాస్పిటళ్లలో ఐసీయూ బెడ్లను రిజర్వ్ చేసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి కేసుల విషయమై తమకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అలా అనైతికంగా ప్రవర్తించే హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ జరుపుతున్నామని తెలిపారు.
కాగా నగరానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, నటులు తమకు కరోనా సోకితే ఎలా.. అని చెప్పి ముందుగానే జాగ్రత్త పడి రోజుకు రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తూ హాస్పిటళ్లలో ఐసీయూ బెడ్లను రిజర్వ్ చేయించుకుంటున్నారని తెలిసింది. నగరంలో పేరుగాంచిన ఓ 4 హాస్పిటళ్లలో ఈ దందా కొనసాగుతుందని సమాచారం. అయితే రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లోని ప్రైవేటు హాస్పిటళ్లలో 2,420 వరకు బెడ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ పలువురు పేషెంట్లు మాత్రం తాము ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తుంటే బెడ్లు అందుబాటులో లేవని చెబుతున్నారని అన్నారు. ఈ క్రమంలో ప్రైవేటు హాస్పిటళ్లు అధిక డబ్బులు ముందుగానే చెల్లించే వారికి బెడ్లను రిజర్వ్ చేస్తుండవచ్చని వారు అభిప్రాయపడ్డారు.