హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ జాంలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక వర్షం పడితే కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్‌లో బారులు తీరుతాయి. అయితే 40 రోజుల నుంచి లాక్‌డౌన్ అమలులో ఉండడంతో సిటీలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేవలం అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతించారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షలకు పలు సడలింపులు ఇవ్వడంతో.. హైదరాబాద్ వాసులు యథాప్రకారం రోడ్లెక్కారు. దీంతో చాలా చోట్ల లాక్‌డౌన్‌కు ముందున్న స్థితి కనిపించింది.
నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతమైన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంతోపాటు పంజాగుట్ట, మియాపూర్, కూకట్‌పల్లి, బేగంపేట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రహదారులపై రద్దీ నెలకొంది. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న ప్రకారం.. వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బారులు తీరాయి. పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ యథాప్రకారం పనిచేశాయి. దీంతో చాలా రోజుల తరువాత హైదరాబాద్‌లో పూర్వ స్థితి కనిపించింది. అయితే దీనిపై పోలీసు అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ వాహనాలు రోడ్లపైకి పెద్ద ఎత్తున రావడం ఆశ్చర్యకరంగా ఉందని పోలీసులు అంటున్నారు. ప్రభుత్వం ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపారులకు 1/3 వ వంతు సిబ్బందితో పనిచేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో అనేక మంది రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. అయితే కొందరు పనిలేకున్నా రోడ్లపైకి వస్తున్నారని, అలాంటి వారిని ప్రస్తుతం గుర్తించడం కష్టతరమవుతుందని అన్నారు. వాహనదారులను ఆపి తనిఖీలు చేస్తూ వెళ్తే.. ట్రాఫిక్ సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక కేవలం అవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలని పోలీసులు సూచిస్తున్నారు.